National

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ నిరసనలో పాల్గొననున్న మమతా బెనర్జీ..

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో మరోసారి కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. పోటీ పరీక్షల్లో సంస్కరణలు కోరుతూ యువత చేపట్టిన ఉద్యమానికి ఆమె తన మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా, జూలై 27న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని శుక్రవారం వెల్లడించారు.

 

ఇదే సమయంలో, లోక్‌సభలో టీఎంసీ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడిగా సీనియర్ నేత సౌగతా రాయ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. బీర్భూమ్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికైన నటి, రాజకీయ నాయకురాలు శతాబ్ది రాయ్ స్థానంలో సౌగతా రాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

 

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు త్రిపుర కేంద్రంగా పనిచేసే ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’లో చేరారు. వారిలో శతాబ్ది రాయ్ కూడా ఉన్నారు.

 

మూడు రోజుల క్రితం కోల్‌కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ అమరవీరుల దినోత్సవ ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగించారు. తాను త్వరలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో పాల్గొంటానని ఆ సందర్భంగా వెల్లడించారు. తాజాగా, ఆ నిరసనలో పాల్గొనే తేదీని ఆమె ఖరారు చేశారు.

 

తన ఢిల్లీ పర్యటనలో మమతా బెనర్జీ కేవలం సీజేపీ నేతృత్వంలోని ఉద్యమంలో పాల్గొనడానికే పరిమితమవుతారా లేక వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులతో, ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో సమావేశాలు నిర్వహిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది