ఢిల్లీలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. నీట్ ఆందోళనల ముసుగులో దేశంలో అరాచకాలు సృష్టించేందుకు కొన్ని కుట్ర శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఎండగట్టారు.
నీట్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల కలలు, తల్లిదండ్రుల ఆశలతో ముడిపడి ఉన్న అంశమని, ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్రంగా కలత చెందారని బండి సంజయ్ తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశామని, ఇప్పటికే సీబీఐ విచారణ వేగవంతం చేసి 11 మంది ఫ్యాకల్టీ సహా మొత్తం 17 మందిని అరెస్ట్ చేసిందని చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా దీనిపై క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. విద్యార్థుల విద్యా సంవత్సరం ఏమాత్రం వృథా కాకూడదనే ఉద్దేశంతో కేవలం 40 రోజుల్లోనే మళ్లీ పరీక్షలు పూర్తి చేసి, ఫలితాలను కూడా వెల్లడించామని వివరించారు.
ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో కమ్యూనిస్టు శక్తులు తీవ్ర అరాచకం సృష్టించాయని ఆయన ఆరోపించారు. ఏకంగా దేశ పార్లమెంట్‌పై దాడి చేసేందుకు కుట్రలు చేస్తూ, దేశ వ్యతిరేక నినాదాలతో విరుచుకుపడ్డారని మండిపడ్డారు. నిరసనల పేరుతో పోలీసులపై, మహిళా జర్నలిస్టులపై అత్యంత అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దాడులు చేశారని విమర్శించారు. ఈ హింసలో 118 మంది పోలీసుల తలలు పగిలి తీవ్ర గాయాలైనా, అత్యంత సంయమనం పాటిస్తూ ఫైరింగ్ చేయలేదని, శాంతిభద్రతల రక్షణ కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ఢిల్లీలో చెలరేగిన ఈ ఉద్రిక్తతల వెనుక విదేశీ కుట్ర కోణం ఉందని బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. పాకిస్థాన్ కేంద్రంగా సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో విష ప్రచారం చేస్తూ, దేశంలో అశాంతిని రేపేందుకు కుట్రలు పన్నుతున్నారని వెల్లడించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, భారత్‌లో అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తున్న పాకిస్థాన్‌కు చెందిన 480 సోషల్ మీడియా అకౌంట్లను తక్షణమే బ్లాక్ చేసిందని బండి సంజయ్ తెలిపారు.

