హైడ్రా కమిషనర్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రం రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బ్లాక్మెయిల్ సాధనంగా వాడుకుంటోందని, హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు వంటిదని ఆయన విమర్శించారు.
మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, బిల్డర్లను, సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేయడానికే హైడ్రాను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. అధికార పక్షానికి చెందిన వారి ఆస్తుల జోలికి వెళ్లడం లేదని, ఇదే నిజమైతే ముఖ్యమంత్రి సోదరుడి అక్రమ కట్టడాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
దేశంలో ఏ అధికారి అయినా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. హైడ్రా రేవంత్ రెడ్డికి వేటకుక్కలా మారిందని, దీనిని అడ్డుపెట్టుకుని బిల్డర్ల వద్ద ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సోదరుడి నివాసంతో పాటు కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్, మహేందర్ రెడ్డి, కేవీపీల అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చివేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను బంగాళాఖాతంలో కలిపేస్తామని స్పష్టం చేశారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కూడా కేటీఆర్ స్పందించారు. ఈ ఉదంతంతో దేశ యువత మొదటిసారిగా మోదీ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన అసమర్థతతో సరైన మద్దతు ఇవ్వలేకపోవడంతో, విద్యార్థులే నేరుగా పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. అవసరం వచ్చినప్పుడు యువత తప్పకుండా స్పందిస్తుందని కేసీఆర్ గతంలోనే చెప్పారని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ హయాంలో నీట్ పేపర్ మూడుసార్లు లీక్ అయిందంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

