AP

ఏపీపై ఎల్‌నినో పంజా.. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష..

ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపుతోంది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు జూమ్ ద్వారా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా అధికారులు పరిస్థితి తీవ్రతను ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో జూలై నెలలో ఏకంగా 69 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో సగటున 35 నుంచి 40 శాతం వరకు వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. జూన్ నుంచి నవంబర్ మధ్య కాలంలో సాధారణంగా 844 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి కేవలం 551 మి.మీ మాత్రమే కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంచనాలకు మించి ఎల్‌నినో ప్రభావం ఉండబోతోందని అధికారులు స్పష్టం చేశారు.

 

ఈ ప్రభావం అన్ని జిల్లాల్లో ఉన్నప్పటికీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.78 లక్షల హెక్టార్లలో పత్తి, 1.07 లక్షల హెక్టార్లలో వరి పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా వేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పడంతో, వంశధార జలాలను తరలించి పంటలను కాపాడేందుకు ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

 

ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో 122 హై రిస్క్ మండలాలను గుర్తించిందని అధికారులు తెలిపారు. ఈ మండలాల్లో బోరు బావుల ఆధారంగా పంటలను కాపాడుకునే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. రైతులకు అవగాహన కల్పించేందుకు ఆగస్ట్ 3 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా అత్యవసర విత్తన ప్రణాళికను సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు.

 

ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద నమోదుకు ఈ నెల 31 వరకు గడువు ఉందని, వరి పంటకు మాత్రం ఆగస్ట్ 15 వరకు సమయం ఉందని అధికారులు గుర్తుచేశారు. మరోవైపు, పశుగ్రాసానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐదు నెలలకు సరిపడా 286.30 లక్షల మెట్రిక్ టన్నుల గ్రాసాన్ని అందుబాటులో ఉంచామని పశుసంవర్ధక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.