ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రాంచీలో అసెంబ్లీ వైపు వెళ్లేందుకు విద్యార్థులు బారికేడ్లను దాటడంతో పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. అయినా కొందరు విద్యార్థులు నృత్యాలు చేస్తూ ముందుకు కదలడం వీడియోల్లో కనిపించింది.
నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్‌లతో తమ భవిష్యత్తు దెబ్బతింటోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ సోమవారం వేలాది మంది రాంచీకి తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో రాజధానికి చేరుకున్నారు.
అసెంబ్లీ ముట్టడికి బయలుదేరే ముందు విద్యార్థి నేత దేవేంద్ర మహతో కీలక సూచన చేశారు. పోలీసులు అడ్డుకున్నప్పుడు వారితో వాగ్వాదానికి దిగొద్దని కోరారు. క్రమశిక్షణతో మరో మార్గం ద్వారా అసెంబ్లీకి చేరేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల మార్చ్ నేపథ్యంలో రాంచీలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దులు, ప్రధాన రహదారులు, హైవేలపై బస్సులు, ప్రైవేటు వాహనాలను తనిఖీ చేశారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాంచీలో చాలా పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.
16 రోజులుగా ఆందోళన
ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఝార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించిన నియామక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 13 పరీక్షలను రద్దు చేసి సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వంతో ఇప్పటికే ఆరు దఫాలుగా చర్చలు జరిగినా పరిష్కారం కాలేదు. తమ డిమాండ్లలో 98 శాతం అంగీకరించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే 13 పరీక్షల్లో కేవలం మూడింటినే రద్దు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని విద్యార్థులు అంటున్నారు. ఆందోళనలో భాగంగా ఆరుగురు విద్యార్థులు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.

