భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై డిస్కవరీ ఛానెల్ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆగస్టు 15న ప్రసారమైన “డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్” అనే ఈ డాక్యుమెంటరీతో ఉలిక్కిపడిన పాకిస్థాన్, ఈ డాక్యుమెంటరీపై, భారత్‌పై ఎదురుదాడికి దిగింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ వివరాలను ఈ డాక్యుమెంటరీ కళ్లకు కట్టింది.
పాకిస్థాన్ సైన్యానికి చెందిన మీడియా విభాగం ‘ఇంటర్-సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్’ (ఐఎస్‌పీఆర్) ఈ డాక్యుమెంటరీపై స్పందిస్తూ, ఇది భారత్ సృష్టించిన కల్పిత కథనమని ఆరోపించింది. ఈ ఆపరేషన్ వంద శాతం విజయవంతమైందన్న భారత వాదనలను అది తోసిపుచ్చింది. అయితే, ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ సైన్యం తీవ్రంగా నష్టపోయిందని, ఆ పరాభవాన్ని కప్పిపుచ్చుకోవడానికే పాక్ ఉన్నతాధికారులు ఇటువంటి దూకుడు ప్రదర్శిస్తున్నారని భారత అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఈ ఆపరేషన్ ధాటికి లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ శిక్షణా కేంద్రాలు, ప్రధాన కార్యాలయాలతో పాటు కీలక మౌలిక వసతులను, కేడర్‌ను భారీగా కోల్పోయాయి. తాజాగా విడుదలైన ఈ డాక్యుమెంటరీ పాకిస్థాన్ పాత గాయాలపై కారం చల్లినట్లయిందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో, డాక్యుమెంటరీ ప్రామాణికతను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా నిరంతర ప్రచార దాడులు నిర్వహించాలని ఐఎస్‌పీఆర్‌కు ఆదేశాలు అందినట్లు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ జరిగినప్పటి నుంచి భారత్‌పై పాకిస్థాన్ ఒక ‘సమాచార యుద్ధాన్ని కొనసాగిస్తోందని, అందులో భాగంగానే సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తప్పుడు కథనాలు, మార్ఫింగ్ వీడియోలను ప్రచారం చేసే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి

