ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత వర్ల రామయ్య, అనంతపురం జిల్లాకు చెందిన బీసీ మహిళా నేత దళవాయి రమాదేవిలను శాసనమండలికి నామినేట్ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సిఫార్సులతో కూడిన దస్త్రాన్ని ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న పండుల రవీంద్రబాబు, జాకియా ఖానమ్‌ల పదవీకాలం ముగియడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ, పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఇద్దరు నేతలకు అవకాశం కల్పించింది. దళిత వర్గానికి చెందిన వర్ల రామయ్య పార్టీలో కీలక నేతగా, గతంలో ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేశారు. పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2009లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు.
మరోవైపు, అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రమాదేవి బీసీ (వడ్డెర) సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. రెండు దశాబ్దాలుగా ఆమె పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంట్ అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె కుటుంబం మొదటి నుంచి టీడీపీకి అండగా నిలుస్తోంది. 2021లో అనంతపురం కార్పొరేటర్‌గా పోటీ చేసిన రమాదేవి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి విశేషంగా కృషి చేశారు.
సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని, పార్టీకి విధేయంగా ఉన్న సీనియర్ నేతకు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మహిళా నేతకు పదవులు ఇవ్వడం ద్వారా టీడీపీ అధిష్ఠానం స్పష్టమైన సందేశం పంపినట్టయింది. ప్రస్తుతం ఈ ఫైల్ గవర్నర్ పరిశీలనలో ఉండగా, ఆయన ఆమోదముద్ర వేయగానే వీరి నియామకం అధికారికంగా ఖరారు కానుంది.

