Uncategorized

మాజీ మంత్రి కారుమూరికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఆయన్ను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా విధానంలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

మద్యం రవాణా కేసులో విచారణ నిమిత్తం కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ అనంతరం ఆదివారం రాత్రి ఆయన్ను అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత ఈడీ కార్యాలయానికి తరలించారు. సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, కారుమూరికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు ఉత్తర్వుల అనంతరం, పోలీసులు కారుమూరి నాగేశ్వరరావును చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. గత ఏపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం వ్యాపార కార్యకలాపాల్లో జరిగిన అవకతవకలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావును నిందితుడిగా పేర్కొన్నారు. ఆయన రిమాండ్‌తో ఈ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది.