తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా ఏకంగా 92.86 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించిన నోటీసులు, పరిశీలనలు వెలువడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన పౌరులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసేందుకు సమగ్ర పరిశీలన అత్యవసరమని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం నిర్ణయించిన గడువులోగా నోటీసులకు స్పందించడం, అభ్యంతరాలు నమోదు చేయడం, అవసరమైన ఆధార పత్రాలను సమర్పించడం సాధారణ పౌరులకు సవాలుగా మారిందని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు, రోజువారీ కూలీలు తమ ఓటు హక్కును నిరూపించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించే సమయాన్ని మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని లేఖలో స్పష్టంగా కోరారు.
దీంతో పాటు, అత్యధికంగా ఓటర్ల సంఖ్య ఉన్న హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో పరిశీలన ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా సాగేందుకు అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను (EROలు) తక్షణమే నియమించాలని సూచించారు. గ్రామసభలు, పురపాలక వార్డుల్లో ఓటర్ల జాబితాను బిగ్గరగా చదివి వినిపించాలని, పట్టణ ప్రాంతాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ఎస్ఐఆర్ ప్రక్రియను వికేంద్రీకరించడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

