ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న బ్యాలెట్ పత్రాల విధానానికి స్వస్తి పలికి, ఇకపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) వాడాలని నిర్ణయించింది. ఓటర్లకు తొలిసారిగా ‘నోటా’ (నన్ ఆఫ్ ది ఎబౌవ్) ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నూతన నిబంధనలతో కూడిన మూడు కీలక జీవోలను జారీ చేసింది.
డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం కఠిన నిబంధనలను ప్రవేశపెట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ తొలి సమావేశం జరిగిన 15 రోజుల్లోగా డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికకు ఒకరోజు ముందే పార్టీలు తమ కౌన్సిలర్లకు విప్ జారీ చేయాలి. విప్‌ను ధిక్కరించిన వారి సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తారు. ఒకవేళ ఓట్లు సమానంగా వస్తే, లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఏదైనా కారణంతో డిప్యూటీ మేయర్ పదవి ఖాళీ అయితే, ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
తాజా నిబంధనల ప్రకారం, నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులకు డిపాజిట్ మొత్తాలను కూడా ఖరారు చేశారు. మేయర్, కార్పొరేటర్ స్థానాలకు పోటీ చేసే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2,500 డిపాజిట్‌గా చెల్లించాలి. అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, నేరచరిత్రకు సంబంధించిన వివరాలతో నోటరీ చేసిన అఫిడవిట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ (సవరణ) చట్టం-2026 (యాక్ట్ నం. 22) ఆగస్టు 28 నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో నం. 210లో పేర్కొంది. పోలింగ్ కేంద్రాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ప్రిసైడింగ్ అధికారికి అధికారాలు కల్పించారు.
ఇదే సమయంలో, కడప నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 66కు పెంచుతూ డ్రాఫ్ట్ ప్రతిపాదనలు విడుదల చేసింది. సెప్టెంబర్ 11 వరకు దీనిపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి, సెప్టెంబర్ 14న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ కొత్త నిబంధనలు, మార్గదర్శకాల ఆధారంగానే రాష్ట్రంలో రానున్న పురపాలక ఎన్నికల ప్రక్రియ జరగనుంది.

