AP

ఏపీలో స్థానిక ఎన్నికలకు వేగంగా అడుగులు.. ఈనెల 22న ఓటర్ల జాబితా..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 41 పట్టణ స్థానిక సంస్థలకు ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ పరిధిలో రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు మరియు నగర్ పంచాయతీలు ఉన్నాయి. ఈ సంస్థలన్నింటికీ ఓటర్ల జాబితాలను రూపొందించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఎస్ఈసీ ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన తాజా ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఈ జాబితాలను తయారు చేయనున్నారు.

2026 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా (Qualifying Date) ఎస్ఈసీ నిర్ణయించింది. ఈ తేదీ నాటికి ఓటు హక్కు పొందిన వారి పేర్లతో జాబితాలను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి, తుది ఓటర్ల జాబితాలను ఈ నెల 22న ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం తన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొంది.

ఇటీవలే మరో 59 మున్సిపాలిటీలలో ఓటర్ల జాబితాల తయారీకి కూడా ఎస్ఈసీ ఇదే తరహాలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా నోటిఫికేషన్‌తో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. వరుస నోటిఫికేషన్ల నేపథ్యంలో త్వరలోనే రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నగారా మోగనుందని స్పష్టమవుతోంది.