రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) వర్గీకరణ రిజర్వేషన్లను అన్ని ప్రభుత్వ విభాగాలు ఎటువంటి మినహాయింపులు లేకుండా కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. సమాజంలో సమానమైన, ఏకీకృత పురోగతిని నిర్ధారించేందుకు ఉద్దేశించిన వర్గీకరణ చట్టాన్ని పూర్తి పారదర్శకతతో అమలు చేయాలని ఆదేశించింది.
రిజర్వేషన్ల అమలు..
ఈ మేరకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజేంద్ర బోయి ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని ప్రభుత్వ విభాగాలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లలో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అమలుపై ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ ప్రభుత్వం తాజా ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ పరిధిలోని అన్ని విద్యాసంస్థల అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాలు, బదిలీల ద్వారా జరిగే నియామకాలు, అలాగే ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను ఎటువంటి ఉల్లంఘనలు లేకుండా పాటించాలని స్పష్టంచేసింది.
గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను కొన్ని విభాగాల్లో ప్రమోషన్ల విషయంలో సరిగ్గా పాటించడం లేదని వచ్చిన ఫిర్యాదులు, ప్రాతినిధ్యాలపై స్పందించిన ప్రభుత్వం, పాత ఉత్తర్వులను మరోసారి పునరుద్ఘాటించింది. సెక్రటేరియట్లోని అన్ని శాఖలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, పీఎస్యూలు, ఇతర స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

