National

సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్.. మార్చి నాటికి భారత్‌లో 55 వేల మరణాలు..!

భూ వాతావరణాన్ని నిరంతరం ప్రభావితం చేసే ‘ఎల్ నినో’.. ఈ ఏడాది మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రరూపం దాల్చింది. పసిఫిక్ మహాసముద్రం నుంచి విపరీతమైన వేడిని విడుదల చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కరువులు, అకాల వర్షాలు, వరదలు, భయంకరమైన తుఫానులకు దారితీస్తోంది. సెప్టెంబర్ నాటికే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 3.08 డిగ్రీల మేర పెరిగినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిన దాఖలు లేకపోవడంతో నిపుణులు దీనిని ‘సూపర్ ఎల్ నినో’గా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ సూపర్ ఎల్ నినోకి సంబంధించి క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ విడుదల చేసిన గణంకాలు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

షికాగో యూనివర్శిటీకి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ రూపొందించిన ‘ఎల్ నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్’ గణాంకాలు ప్రస్తుతం అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే 6 నెలల కాలంలో ఈ తీవ్రమైన ఎల్ నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,73,000 మందికి పైగా అదనంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే తీవ్రమైన వేడివల్ల తలఎత్తే ప్రమాదాలను ముందుగానే గుర్తించడం ద్వారా ఆయా దేశాల పాలకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ సహ వ్యవస్థాపకుడు మైఖేల్ గ్రీన్ స్టోన్ తెలిపారు.

ఈ ప్రాణాంతక ఎల్ నినో ప్రభావం ప్రధానంగా గ్లోబల్ సౌత్ దేశాలపైనే తీవ్రంగా పడనుందని సదరు నివేదిక అంచనా వేసింది. అక్టోబర్ నుండి మార్చి మధ్య కాలంలో భారత్‌లో వేడిగాలులు, ఉష్ణోగ్రతల తీవ్రత కారణంగా దాదాపు 55,000 మంది ప్రాణాలు కోల్పోవచ్చని ఈ ట్రాకర్ పేర్కొంది. అందులోనూ ముఖ్యంగా వచ్చే ఏడాది మార్చి నెలలోనే అత్యధికంగా మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆఫ్రికా దేశమైన నైజీరియాలో కూడా ఇదే స్థాయిలో (56,000) మరణాలు సంభవించవచ్చని అంచనా వేసింది.

మరోవైపు ఆగ్నేయాసియా దేశాలు సైతం ఎల్ నినో ముప్పును ఎదుర్కోనున్నాయని ‘ఎల్ నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్’ రిపోర్ట్ అభిప్రాయపడింది. ఇండోనేషియాలో వేడి సంబంధిత సమస్యలతో సుమారు 29,000 మంది, బ్రెజిల్‌లో 19,000 మంది వరకు మరణించే ప్రమాదముందని హెచ్చరించింది. కాబట్టి ఆయా దేశాలు ఇప్పటి నుంచే ఎల్ నినో ముప్పును తగ్గించే చర్యలు చేపట్టడం ద్వారా ఈ ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని చెప్పింది.

ఇదిలా ఉంటే ఎల్ నినో ప్రభావంతో ముంబై వంటి తీరప్రాంత నగరాల్లో వాయు కాలుష్యం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణుడు, ‘సఫార్’ (SAFAR) వ్యవస్థాపక ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ గుఫ్రాన్ బేగ్ హెచ్చరించారు. సాధారణంగా ముంబైకి సముద్రం నుంచి వీచే బలమైన ఈదురు గాలుల వల్ల కాలుష్యం త్వరగా కొట్టుకుపోతుందని.. అయితే ఎల్ నినో ప్రభావంతో ఈ గాలుల వేగం తగ్గిందని ఆయన అన్నారు. దీనివల్ల కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోయి నగరవాసులను ఆందోళనకు గురిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

2027 వరకు కోలుకోవడం కష్టమే: WHO

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తెలిపిన వివరాల ప్రకారం.. 1950 తర్వాత వచ్చిన అత్యంత బలమైన ఎల్ నినో ఇదే. డిసెంబర్ నాటికి ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాకుండా వర్షభావ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ప్రపంచదేశాల్లో ఒకవైపు తీవ్ర కరువు తాండవిస్తే.. మరొకవైపు భారీ వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఈ సూపర్ ఎల్ నినో ప్రభావం దాదాపు 2027 తొలి నాళ్ల వరకు కొనసాగవచ్చని స్పష్టం చేసింది.