AP

లోక్‌సభ సీట్ల పెంపునకు చంద్రబాబు మద్దతు.. దక్షిణాదిపై కీలక విజ్ఞప్తి..

ఢిల్లీలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి సహా ఇతర కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు తాను మద్దతుగా నిలుస్తున్నానని చెప్పారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్న తీరు బాగుందన్నారు. మూడు దశాబ్దాలుగా ఆశగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు ఒక దశకు రావడం సంతోషకరమన్నారు. లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచడం స్వాగతించదగిన నిర్ణయమని స్పష్టం చేశారు.

జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఎంతో కష్టపడ్డాయని, అందులో ఆంధ్రప్రదేశ్ ముందుందని చంద్రబాబు గుర్తు చేశారు. తాను కూడా ఉమ్మడి ఏపీలో ఫ్యామిలీ ప్లానింగ్‌పై క్యాంపెయిన్ మోడ్‌లో పనిచేసి ఫెర్టిలిటీ రేటు తగ్గించానని చెప్పారు. 1971, 2011, 2026 సెన్సెస్ లెక్కల ప్రకారం ముందుకు వెళ్తే దక్షిణాదికి ఇబ్బందులు వస్తాయన్నారు. అందుకే జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని కేంద్రాన్ని కోరామన్నారు. ఈ నిర్ణయం దక్షిణాదికి శాపంగా మారకూడదని తెలిపారు. ప్రతి రాష్ట్రానికీ అదనంగా 50 శాతం సీట్లు పెరిగేలా చర్యలు తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు.

ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, కుటుంబ నియంత్రణ నుంచి పాపులేషన్ మేనేజ్‌మెంట్ వైపు వెళ్తూ ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చంద్రబాబు వివరించారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా 1976లో డీలిమిటేషన్ జరిగిందన్నారు. అప్పుడు 58.8 కోట్ల జనాభాకు 542 సీట్లు ఉండేవని చెప్పారు. 2026 నాటికి జనాభా దాదాపు 147 కోట్లకు చేరినా, 543 సీట్లే ఉండటం సరైంది కాదన్నారు. చైనాలో 140 కోట్ల జనాభా ఉందని, 2100 నాటికి భారత్‌లో చైనా కంటే రెట్టింపు జనాభా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

1971లో పది లక్షల మందికి ఒక ఎంపీ ఉండగా.. ఇప్పుడు 27 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారని చంద్రబాబు లెక్కలు చెప్పారు. అమెరికాలో 7.8 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. తాజా నిర్ణయంతో 50 శాతం సీట్లు పెరిగితే, ప్రతి 18 లక్షల మందికి ఒక ఎంపీ ఉండే అవకాశం ఏర్పడుతుందన్నారు. అన్ని అంశాలను ఆలోచించే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.