తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేంద్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న భూ సర్వే, కొత్త పాస్బుక్ల జారీపై కీలక విషయాలు వెల్లడించారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సవితితల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. అన్ని శాఖల్లోనూ తెలంగాణపై వివక్ష కొనసాగుతోందని మంత్రి విమర్శించారు. కరువు బృందం పర్యటించినా ఆశించిన స్థాయిలో నిధులు వస్తాయన్న నమ్మకం లేదన్నారు. రాష్ట్రం 13 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కోరితే కేంద్రం కేవలం రెండు లక్షలు మాత్రమే మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, కేసీఆర్ ఫామ్ హౌస్ లెక్కలు, ధరణి సీఐడీ విచారణ దాదాపు చివరి దశకు చేరుకున్నాయని మంత్రి తెలిపారు. ‘సాంకేతిక ఆధారాలు, పక్కా లెక్కలతో గత ప్రభుత్వ అక్రమాలను బయట పెడతాం. సర్వేల పేరుతో బీఆర్ఎస్ నేతలు పగటికలలు కంటున్నారు. అంతిమంగా విజయం మాదే’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
భూ యజమానులకు ఉచితంగా వాటర్‌ప్రూఫ్ పాస్‌బుక్‌లు అందించనున్నారు. ఈ కొత్త పాస్‌బుక్‌లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే భూమి వివరాలు మ్యాపింగ్‌తో సహా కనిపిస్తాయి. రెగ్యులర్ భూములకు ఒకటి, వ్యవసాయ భూములకు మరొకటి చొప్పున రెండు వేర్వేరు రంగుల్లో పాస్‌బుక్‌లు ఇస్తారు. వీటిపై యజమానుల ఫోటోలు ఉండవు.
భూ సర్వే లక్ష్యం, క్షేత్రస్థాయి పర్యటనలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భూ సర్వే వేగంగా జరుగుతోందన్నారు. డిసెంబర్ నాటికి 2,300 గ్రామాల్లో, ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి చేసి దేశానికే రోల్ మోడల్‌గా నిలుపుతామని మంత్రి తెలిపారు. సర్వే పూర్తయితే సాదాబైనామా సమస్యలు తొలగిపోవడంతో పాటు, అటవీ శాఖ పరిధిలోని 26 లక్షల ఎకరాల భూమికి క్లియర్ టైటిల్ ఇస్తామని చెప్పారు. భవిష్యత్తులో సర్వే నంబర్లకు బదులుగా స్పెషల్ ఖాతా నంబర్లు ఇస్తామన్నారు. భూమి తక్కువగా ఉన్న అర్హులకు చివరి దశలో న్యాయం చేస్తామన్నారు. ఈ ప్రక్రియపై వచ్చే మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తానని, డిసెంబర్ నుంచి గ్రామాల్లోనే రాత్రి బస చేసి ప్రజల సమస్యలను నేరుగా వింటానని పొంగులేటి వెల్లడించారు.

