National

మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక ప్రకటన..!

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. మహిళలకు వారి హక్కులను అందించే మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ పోరాటంలో తాను కూడా భాగమేనన్న మోదీ.. నారీ శక్తికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని పునరుద్ఘాటించారు.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ప్రధాని తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిజానికి 2023లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. అయితే దీనిని డీలిమిటేషన్ తో ముడిపెట్టడంతో అది అమలుకు నోచుకోలేదు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి.. మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని కేంద్రం పట్టుదలగా ఉంది.

ఇదిలా ఉంటే వచ్చేవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో సీట్లను సమానంగా 50 శాతం పెంచేలా రూపొందించిన ఈ కొత్త బిల్లుకు ఎన్సీపీ (NCP), డీఎంకే (DMK) అధికారికంగా మద్దతు ప్రకటించాయి. దీంతో బిల్లు ఆమోదానికి కావాల్సిన 2/3 వంతు సంఖ్య బలానికి బీజేపీ మరింత చేరువైంది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ లో ఇవే పార్టీలు.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడంతో అది వీగిపోవడం గమనార్హం.

ఇక సోమవారం ప్రవేశపెట్టనున్న ‘రాజ్యాంగ సవరణ బిల్లు – 2026’ ప్రకారం లోక్‌సభలో గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి (50 శాతం) పెంచనున్నారు. ఇందులో రాష్ట్రాల నుంచి 815 మంది.. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది సభ్యులు ఉంటారు. అలాగే రాష్ట్ర శాసనసభల గరిష్ఠ సభ్యుల సంఖ్య పరిమితిని కూడా 500 నుంచి 650కి పెంచాలని ఈ బిల్లులో కేంద్రం ప్రతిపాదించనుంది. ఇక ఈ బిల్లు ఆమోదానికి 360 (2/3 వంతు) సభ్యుల మద్దతు అవసరం ఉండగా.. ఇప్పటికే 355 మందికి పైగా సభ్యుల మద్దతును బీజేపీ కూడగట్టినట్లు తెలుస్తోంది.