హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనబోతున్న జనాలకు షాక్ ఇచ్చారు. తాగి రోడ్ల మీదికి రాకుండా జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కఠినంగా నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈరోజు రాత్రి సమయంలో ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. నేటి రాత్రి నుండి రేపు ఉదయం వరకు హైదరాబాదులోని అన్ని ప్రధాన రోడ్లపై కూడా ఆంక్షలు అమలు కాబోతున్నాయి. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 10,000 రూపాయల ఫైన్ విధించబోతున్నట్లుగా ట్రాఫిక్ డిసిపి ప్రకటించారు.
అంతే కాకుండా ఆరు నెల జైలు శిక్ష కూడా ఉండొచ్చని ఆయన హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండవ సారి పట్టుబడితే 15 వేల రూపాయల ఫైన్ మరియు రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికి ఇక ముందు డ్రైవింగ్ చేసే వీలు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సల్ చేయనున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. కొత్త సంవత్సరం ను ప్రతి ఒక్కరూ సేఫ్ గా జరుపుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని, ఆనందంగా కొత్త సంవత్సరం లో అడుగు పెట్టాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇంత చెప్పినా కూడా కొందరు చెవిన పెట్టకుండా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాత్రి ఎన్ని వందల కేసులు నమోదు అవుతాయో చూడాలి.