World

AMAZON … 18 వేల మంది ఉద్యోగుల తొలగింపు..

ఆన్ లైన్ రిటైలర్ అయిన అమెజాన్ 18 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. అస్థిర ఆర్థిక పరిస్థితుల వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక సమస్యల వల్ల ఇటువంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం గురించి అమెజాన్ సీఈఓ ఆండీ జే తన కంపెనీ ఉద్యోగులకు పలు విషయాలను వెల్లడించారు. వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లో అమెజాన్ 10,000 ఉద్యోగాలను మాత్రమే తొలగిస్తున్నట్లు తెలుపగా అయితే ఆ సంఖ్య కాస్తా ఇప్పుడు 8,000కు పెరిగింది. మొత్తంగా చూస్తే 18000 మంది ఉద్యోగులను తమ విధుల నుంచి తప్పించనున్నారు. ఇదే విషయంలో అమెజాన్ సీఈఓ ఆండీ జే మాట్లాడుతూ అమెజాన్ గతంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొందని తెలిపారు.

భవిష్యత్తులోనూ ఇలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. ఇటువంటి సమస్యలు రాకుండా అమెజాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా 10,000 మంది ఉద్యోగులను క్రమంగా తొలగిస్తామని, ఆ తర్వాత అదనంగా 8 వేల మందిని తొలగించనున్నట్లు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించబడే వారి పరిస్థితి కూడా తమకు తెలుసని కానీ కంపెనీ భవిష్యత్తు కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోక తప్పడం లేదని అమెజాన్ యాజమాన్యం తెలిపింది. తమ ఉద్యోగాలు కోల్పోనుండటంతో ఇప్పుడు 18 వేల మంది పరిస్థితి దయనీయంగా మారింది. కొందరు వేరే ఉద్యోగాలను చూసుకునే వేటలో పడ్డారు. మరికొందరు మాత్రం తమ సేవింగ్స్ ను వాడుకుని కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నారు. ఏది ఏమైనా తమకు మాత్రం అన్యాయం జరిగిందని మరికొందరు ఉద్యోగులు తమ గోడును వెల్లడించారు.