TELANGANA

తారకరత్న శరీరం రంగు నీలి రంగులోకి ఎందుకు మారిందంటే?

టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర “యువగళం” లో మొదటి రోజే అనూహ్య సంఘటన జరిగింది. నందమూరి వారసుడైన నందమూరి తారకరత్న కళ్ళు తిరిగి పడిపోవడం సంచలనం రేపింది. యాత్ర మొదటి రోజే ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. దీనితో అందరూ ఒకింత ఆశ్చర్యానికి, అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే స్పందించి హాస్పిటల్ కు చేర్చగా.. తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. దానివల్లే అతను పడిపోయాడని తెలిపారు. అయితే పడిపోయిన కొంత సేపటికే తారకరత్న శరీరం మొత్తం నీలిరంగులోకి మారిపోయింది. దీనితో అక్కడున్న వారంతా ఆందోళన చెందారు. అయితే హాస్పిటల్లో యాంజియోగ్రామ్‌ చేసిన వైద్యులు.. గుండె రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్‌ లు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇప్పుడైతే తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిపారు వైద్యులు. డాక్టర్లు తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ప్రకటించినా, జనాల్లో తారకరత్న శరీరం ఎందుకు నీలి రంగులోకి మారిందనే ఆందోళన మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం ఆయనను బెంగుళూరుకు తరలించినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఇదిలా ఉండగా తారకరత్న ను పరీక్షించిన డాక్టర్ ఆసక్తికర విషయాలను ప్రకటించారు. ఈ విషయమై డాక్టర్‌ ముఖర్జీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

తారకరత్న బాడీలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయని.. ఆ కారణంగానే తారకరత్న శరీరం నీలంగా మారిందని తెలిపారు. “మన శరీరంలోని రక్తం అన్ని అవయాలకు సరిగా అందనపుడు అవయవాల చివరన.. చేవేళ్లు చివరన, కాలివేళ్లు చివరన, పెదాలు నీలం రంగులోకి మారతాయి” అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తారకరత్న విషయంలో కూడా అదే జరిగిందని డాక్టర్ వెల్లడించారు. తారకరత్న బాడీలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల రక్తంలో కార్బన్ డై ఆక్సెడ్‌ ఎక్కువ అయిపోయి, ఆక్సిజన్‌ తక్కువ అయ్యింది. ఇలాంటి సందర్భంలోనే హిమోగ్లోబిన్‌ అనేది నీలిరంగులోకి మారిందని చెప్పుకొచ్చారు డాక్టర్. భయపడాల్సిందేమి లేదని.. మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలియజేసారు. తారకరత్న ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నట్టు నందమూరి వర్గాలు తెలుపుతున్నాయి.