ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న బెంగళూరులో పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ, “మూడు రాజధానుల కాన్సెప్ట్ మిస్ కమ్యూనికేషన్ అయ్యింది. ఏపీకి విశాఖ ఒక్కటే రాజధానిగా ఉంటుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్, గుంటూరులో ఓ అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తాము. విశాఖ నుంచే పాలన సాగుతుంది,” అంటూ ఇంతకాలం వైసీపీ మనసులో దాచుకొన్న రహస్యాన్ని బయటపెట్టేశారు. బుగ్గన చేసిన ఈ తాజా ప్రకటనపై రాష్ట్రంలో అప్పుడే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుండటంతో వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్మీట్ పెట్టి నష్టానివారణ చర్యలకి పూనుకొన్నారు. “బుగ్గన ఏ సందర్భంలో ఆ మాటలు అన్నారో నాకు తెలీదు. కానీ మా ప్రభుత్వం మూడు రాజధానులకి కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టు తీర్పుకి లోబడే సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకి తరలివెళ్తారు. కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేస్తాము. అమరావతిలో శాసనసభ కొనసాగుతుంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొనే కొందరు రాజకీయ నాయకులే బుగ్గన చెప్పిన విషయాలని వక్రీకరిస్తున్నారు.
కనుక రాష్ట్ర ప్రజలు మూడు రాజధానుల విషయంలో ఎటువంటి అనుమాలు, అపోహలు పెట్టుకొనవసరం లేదు,” అని అన్నారు. మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ, “మా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉంది. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో శాసనసభ ఉంటాయి. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెండాలనే ఉద్దేశ్యంతో ప్రజల ఆకాంక్షల మేరకే సిఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. కనుక మా పార్టీ, ప్రభుత్వం దానికే కట్టుబడి ఉంటాయి,” అని అన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలని మభ్యపెడుతూ మూడున్నరేళ్ళు వైసీపీ ప్రభుత్వం కాలక్షేపం చేసేసింది. మరో ఏడాదిలోగా ఎన్నికలు రాబోతున్నాయి. నానాటికీ ఆర్ధిక పరిస్థితులు క్షీణిస్తూ, సమస్యలు పెరిగిపోతున్నందున ఒకవేళ ముందస్తుకి వెళ్ళవలసివస్తే ఇక మూడు రాజధానుల గురించి ఆలోచించే సమయం కూడా ఉండదు. ఒకవేళ సుప్రీంకోర్టు అనుమతించినా మూడు రాజధానుల కోసం శాసనపరంగా చేయవలసిన ప్రక్రియ చాలానే ఉంటుంది. కర్నూలుకి హైకోర్టు తరలించాలంటే శాసనసభలో తీర్మానం ఆమోదించి సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటుంది. అసలు ఈ పనులకే సమయం సరిపోదు. ఆ తర్వాత విశాఖలో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిద శాఖల కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగులకి ఇళ్ళు, ఆ తర్వాత వారి తరలింపు ప్రక్రియ ఉంటుంది. ఇవన్నీ ఏడాదిలోగా ఏవిదంగా పూర్తిచేయగలదు? ఒకవేళ చేసినా వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే మళ్ళీ అమరావతికి తరలించడం ఖాయం! కనుక వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు చూసుకోవచ్చని వైసీపీ అనుకోకుండా ఉంటుందా? కనుక రాబోయే ఎన్నికల తర్వాతే ఏపీ రాజధానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు.