AP

ఒంగోలు ఎంపీగా పోటీ, వైసీపీలో రాజీనామాల పర్వంపై మౌనం వీడిన వైవీ సుబ్బారెడ్డి..

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు విడతల్లో 59 లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

 

తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడటానికి, పోలింగ్ తేదీకి మధ్య సుమారు 40 రోజుల వరకు వ్యవధి ఉంటుందని, జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారాన్ని కూడా అప్పుడే తేల్చేయాలని టీడీపీ భావిస్తోంది.

 

 

టికెట్ దక్కని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాల బాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు డాక్టర్ సంజీవ్ కుమార్ (కర్నూలు), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం) ఇప్పటికే రాజీనామాలు చేశారు. సీ రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు, వంశీకృష్ణ యాదవ్.. వంటి సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. మున్ముందు మరికొందరు రాజీనామాలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

 

ఈ పరిణామాలపై వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన వారికి, వారి ఆకాంక్షలను అనుగుణంగా పని చేయని ప్రజా ప్రతినిధులకు టికెట్లు ఉండబోవంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు నుంచీ స్పష్టం చేస్తూనే వస్తోన్నారని గుర్తు చేశారు.

 

ముందు చెప్పినట్టుగానే ఆదరణ కోల్పోయిన ఎమ్యెల్యేలు గానీ, ఎంపీలకు గానీ టికెట్లు ఇవ్వట్లేదని తేల్చి చెప్పారు. పార్టీకి రాజీనామాలు చేయడంపై ఎవరి వ్యక్తిగత కారణాలు వారికి ఉంటాయని వ్యాఖ్యానించారు. టికెట్ రాని వారందరూ రాజీనామాలు చేయట్లేదు కదా అని వ్యాఖ్యానించారు.

 

175 నియోజకవర్గాలనూ గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నామని, దానికి తగ్గట్టే మార్పులు- చేర్పులు చేపడుతున్నామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థుల మార్పు అనేది తప్పనిసరి అయిన స్థానాల్లో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా, వారు కోరుకున్న వారిని ఇన్‌ఛార్జీలుగా నియమిస్తోన్నామని చెప్పారు.

 

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై తన నిర్ణయం ఏమిటనేది వైఎస్ జగన్‌కు చాలాసార్లు చెప్పానని వైవీ అన్నారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయదలచుకోలేదనే విషయాన్ని చాలా సార్లు తెలియజేశానని పేర్కొన్నారు. ఈ విషయంలో జగన్‌దే తుది నిర్ణయం అని, దాన్ని శిరసా వహిస్తానని అన్నారు.

 

ఎంపీగా పోటీ చేయదలచుకుంటే 2019లోనే ఆ పని చేసి ఉండేవాడినని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించాల్సి రావడం వల్ల కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్నానని, అందుకే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటోన్నానని అన్నారు.