TELANGANA

దావోస్‌లో రేవంత్ రెడ్డి పర్యటన ..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటోన్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై కసరత్తు సాగిస్తోన్నారు. త్వరలోనే దీన్ని ప్రకటించే అవకాశం ఉంది.

 

పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఆయన దావోస్‌ పర్యటనకు శ్రీకారం చుట్టారు. స్విట్జర్లాండ్‌లో ఈ సిటీలో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

ఈ పర్యటనలో ఆయన వెంట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఉన్నారు. భారత కాలమానం ప్రకారం.. ఈ సాయంత్రం 7 గంటల సమయంలో రేవంత్ రెడ్డి జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు. జ్యూరిచ్‌లో నివసిస్తోన్న పలువురు తెలంగాణ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు బయలుదేరి వెళ్లారు రేవంత్ రెడ్డి.

 

రేవంత్, శ్రీధర్ బాబు వెంట దావోస్ వెళ్లిన వారిలో ముఖ్యమంత్రి కార్యదర్శి వీ శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్ రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల వ్యవహారాల విభాగం ప్రత్యేక కార్యదర్వి విష్ణువర్ధన్ రెడ్డి, మీడియా ప్రతినిధి కర్రి శ్రీరామ్, ముఖ్య భద్రతాధికారి తస్ఫీర్ ఇక్బాల్, ఉదయ సింహా, గుమ్మి చక్రవర్తి ఉన్నారు.

 

దావోస్‌లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సు ఏర్పాటవుతుంటుందనే విషయం తెలిసిందే. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీ నేషనల్ కంపెనీల కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతుంటారు. భారత్ నుంచి ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదాని.. వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు క్రమం తప్పకుండా హాజరవుతుంటారు.

 

దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఇప్పటికే అక్కడ తెలంగాణ పెవిలియన్ ఏర్పాటైంది. దీన్ని రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. సమ్మిళిత, సమతుల్యాభివృద్ధిని సాధించడానికి అందరి సహకారంతో తెలంగాణను పునర్నిర్మించడానికి శక్తివంచన లేకండా కృషి చేస్తానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.