AP

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఫలితాల వెల్లడి మొదలవుతుంది. పూర్తి ఫలితాలు రావడానికి మూడు రోజుల సమయం పట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న జరిగిన 9 ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమగోదావరి స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో దాదాపు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గెలుపు తమదంటే తమదని రాజకీయ పార్టీలన్నీ బలంగా చెప్తున్నాయి. అన్ని స్థానాలు తమవేనని అధికార YCP ప్రకటించింది. మరో వైపు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఆ అభ్యర్థులకు ఓటు వేయమని జనసేన చెప్పకపోవడం ఈ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

 

విశాఖ గ్రాడుయేట్‌ స్థానం నుంచి 37 మంది, కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 49 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 22 మంది పోటీలో ఉన్నారు. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది పోటీలో నిలిచారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు, కర్నూలు స్థానానికి ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు పోటీపడ్డారు.

 

బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లెక్కింపు ప్రక్రియలో ముందు బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన ఉంటుంది. ముందుగా చెల్లని ఓట్లను పక్కన పెట్టేస్తారు. బ్యాలెట్‌ పేపర్‌లో 1,2 3 అంకెలకు బదులు ABC లేదా ఇతర అక్షరాలు ఉన్న బ్యాలెట్‌ పేపర్లను చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. మిగిలిన ఓట్లను లెక్కలోకి తీసుకొని ఒక కోడ్‌ ప్రకారం లెక్కింపు చేపడతారు.