TELANGANA

దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతుంది..-: సీఎం కేసిఆర్.

దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోందని.. దాన్నెవరూ ఆపలేరని బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆదివారం మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని లోహలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని 75 ఏళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఎలాంటి తేడా లేదని కేసీఆర్‌ విమర్శించారు. రైతులు ఐక్యంగా నిలిస్తే అడ్డుకోగల శక్తి ఎవరికీ లేదని అన్నారు. శివాజీ, అంబేడ్కర్‌ పుట్టిన నేలలో త్వరలోనే విప్లవం వస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే మహారాష్ట్రకు తాను రానేరాని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు కేసీఆర్‌ సవాల్‌ విసిరారు.

 

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా లోహాలో నిర్వహించిన ఈ బహిరంగ సభలో.. మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్‌ వాళ్లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దాదాపు 35 నిమిషాల కేసీఆర్‌ ప్రసంగం పూర్తిగా రైతు సమస్యలుపైనే సాగింది. అధికారంలో ఉన్నవాళ్లు రైతు ఆత్మహత్యలను తేలిగ్గా తీసుకుంటున్నారని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 75 ఏళ్లుగా ఎన్నో పార్టీలు, ప్రభుత్వాలు మారినా రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో రైతులకు అందిస్తున్న తరహాలోనే ఎకరానికి 10 వేల రూపాయలు పెట్టుబడి మొత్తం, అత్యంత నాణ్యమైన విద్యుత్‌తో పాటు ప్రాజెక్టుల నుంచి సాగునీటిని రైతులకు ఉచితంగా అందించాలని మహారాష్ట్ర సర్కారను కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

 

ఇదిలా ఉంటే అంతకు ముందు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌కు, అక్కడి నుంచి లోహా వరకు హెలికాప్టర్‌లో అక్కడి నుంచి సభాస్థలికి కేసీఆర్‌ బస్సులో చేరుకున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వ్యాఖ్యలను ఈ సభలో కేసీఆర్‌ ప్రస్తావించారు. తన రాకను ప్రశ్నించడాన్ని కేసీఆర్‌ తప్పుబట్టారు. తెలంగాణలో రైతులకందిస్తున్న సదుపాయాలు మహారాష్ట్ర రైతులకు అందిస్తే తాను ఇక్కడికి రానని ఫడ్నవీస్‌కు సవాల్‌ విసిరారు. అంతే కాదు బీఆర్‌ఎస్‌నును పటిష్టంగా చేసేందుకు త్వరలో మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.