టీడీపీకి అమ్ముడుపోయారనే అభియోగంతో ఇటీవలే వైసీపీకి చెందిన నలుగురు శాసనసభ్యులు పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత తెలుగు దేశం పార్టీ తనతోనే బేరసారాలు సాగించిందనన్నారు. తనకు తెలుగుదేశం పార్టీ నుంచి 10 కోట్ల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ నేతలు తనతో బేరం ఆడారని రాపాక వరప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటును అమ్ముకుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని, కానీ తాను అలా చేయలేదని తెలిపారు. రాజోలులో ఆదివారం జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన తన మిత్రుడు ఏఎస్ఎన్ రాజుతో టీడీపీ నేతలు బేరసారాలు ఆడారని తెలిపారు. అసెంబ్లీ దగ్గర కూడా తనతో బేరాలకు దిగారన్నారు. టీడీపీకి ఓటేయాలని కోరారని, టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారని ఆయన పేర్కొన్నారు.