National

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని తన అధికారిక బంగళాను శనివారం ఖాళీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని తన అధికారిక బంగళాను శనివారం ఖాళీ చేశారు.

లోక్ సభ సభ్యత్వానికి అనర్హత (disqualification)వేటు పడిన కారణంగా ప్రభుత్వం ఆయనను అధికారిక బంగళాను ఖాళీ చేయమన్న విషయం తెలిసిందే. దాంతో, శనివారం ఆయన తుగ్లక్ రోడ్ లోని 12 నెంబర్ బంగళాను ఖాళీ చేశారు.

Rahul Gandhi disqualification row: ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు

ప్రధాని మోదీ (PM Modi) ఇంటిపేరైన ‘మోదీ’పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయన లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడు అయినట్లుగా లోక్ సభ సెక్రటేరియట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎంపీ హోదాలో ఆయనకు కేటాయించిన బంగళాను ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేయాలని ప్రభుత్వం మార్చి 27న ఆదేశించింది. దాంతో, గత 19 ఏళ్లుగా తను ఉంటున్న ఆ బంగళాను రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం ఖాళీ చేసి, తన తల్లి నివాసం ఉంటున్న 10, జనపథ్ రోడ్ కు వెళ్లారు.

Price for speaking truth : వాస్తవాలు మాట్లాడినందుకు చెల్లిస్తున్న మూల్యం

12, తుగ్లక్ రోడ్ లో గత 19 ఏళ్లుగా తను నివాసం ఉంటున్న బంగళాను ఖాళీ చేస్తూ, రాహుల్ గాంధీ (Rahul Gandhi) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సత్యం మాట్లాడినందుకు తను చెల్లిస్తున్న మూల్యం అనర్హత వేటు అని, నిజాలు మాట్లాడడం కోసం ఎంత మూల్యమైనా చెల్లించడానికి తాను సిద్ధమేనని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు ఈ బంగళాలో 19 ఏళ్ల పాటు నివసించడానికి అనుమతి ఇచ్చారు. అందుకు వారికి ధన్యవాదాలు. అయితే, నిజం మాట్లాడినందుకు నాపై అనర్హత వేటు పడింది. సత్యం కోసం ఎంత మూల్యమైనా చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని రాహుల్ (Rahul Gandhi) పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రజల హృదయాల్లో ఉన్నారని, కొందరు రాహుల్ (Rahul Gandhi) ను సోదరుడిగా, మరి కొందరు కుమారుడిగా తమ గుండెల్లో దాచుకున్నారని కాంగ్రెస్ ఒక ట్వీట్ లో పేర్కొంది. ప్రభుత్వం ఇలాంటి చర్యలతో తమను భయపెట్టలేదని వ్యాఖ్యానించింది.