ముంబై: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ.. ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలయింది. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది ఈ సినిమా. నాసిరకం గ్రాఫిక్స్ వాడటం వల్ల రామాయణాన్ని చూస్తోన్న ఫీలింగ్ కలగట్లేదని చెప్పినవారూ లేకపోలేదు.
ప్రత్యేకించి- లంకలో రావణుడి ముందు హనుమంతుడు చెప్పే డైలాగులు తీవ్ర విమర్శల బారిన పడ్డ విషయం తెలిసిందే. గుడ్డ నీ బాబుది, తైలం నీ బాబుది, కాలేది కూడా నీ బాబుదే అంటూ హనుమంతుడు చెప్పే డైలాగ్.. విమర్శల సునామీని ఎదుర్కొంది. రామయణ స్ఫూర్తిని దెబ్బతీసిందంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
దీనితో ఆదిపురుష్ యూనిట్ వెనక్కి తగ్గింది. ఆ డైలాగులను మార్చాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ మున్తాషిర్ శుక్లా ఓ ప్రకటన విడుదల చేశారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీనిపై సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. వివాదాస్పద డైలాగులను సవరించదలచనున్నట్లు వెల్లడించారు. తనను సనాతన ద్రోహిగా ఆరోపించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
అయినప్పటికీ- ఆదిపురుష్ సినిమాపై చెలరేగిన విమర్శల దాడి తగ్గట్లేదు. దాని తీవ్రత మరింత పెరుగుతోనే వస్తోంది. తాజాగా ప్రముఖ టీవీ నటుడు సునీల్ లాహ్రీ దీనిపై స్పందించారు. ఆదిపురుష్ మూవీపై ఘాటు విమర్శలు చేశారు. సునీల్ లాహ్రీ మరెవరో కాదు. కోట్లాదిమందిని ఉర్రూతలూగించిన టీవీ రామాయణంలో లక్ష్మణుడి పాత్రధారి. టీవీ రామాయణానికి రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.