AP

జగన్ వద్దే తేల్చుకున్న అనిల్ కుమార్ యాదవ్

మరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు సిటీ శాసన సభ్యడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. కొంతకాలంగా వార్తల్లో వ్యక్తిగా ఉంటోన్నారు.

పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే గుడ్‌బై చెప్పొచ్చనే ప్రచారం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగింది. సొంత పార్టీలోనే తనకు వెన్నుపోటుదారులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. దీనికి మరింత బలాన్నిచ్చాయి.

వైఎస్ఆర్సీపీలో కొనసాగడంపైనా క్లారిటీ ఇచ్చారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన గుండె చప్పుడుగా అభివర్ణించారు. తనను కోస్తే జగన్ కనిపిస్తాడని పేర్కొన్నారు. జగన్‌కు మిలిటెంట్ స్క్వాడ్ లాంటి వాడినని, కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ మారబోతోన్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు.

అదే సమయంలో అనిల్ కుమార్ యాదవ్‌పై అసహనంగా ఉంటూ వస్తోన్న కొందరు నాయకులు జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనిల్ కుయార్ యాదవ్‌కు మళ్లీ టికెట్ ఇస్తే తాము ఆయనకు అనుకూలంగా పని చేయబోమంటూ వారు హెచ్చరించినట్లు తెలుస్తోంది.