AP

కుమార్తె వివాహానికి వెళ్తుండగా.. నదిలో పడిన డీసీఎం : ఐదుగురి మృతి

పెళ్లిబృందాన్ని తీసుకెళ్తున్న డీసీఎం నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.

మరో 20 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్ లో బుధవారం ఉదయం జరిగింది. దతియా జిల్లాలోని దుర్సదా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన పలువురు చిన్నారులు నదిలో గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు.

బుహారా గ్రామం సమీపంలో పెళ్లిబృందంతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పింది. దాంతో వాహనం వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఐదుగురు మృతి చెందగా.. వారిలో వృద్ధురాలు, యువకుడు, రెండు నుంచి మూడేళ్ల వయసున్న ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. బాధితులు గ్వాలియర్ లోని బిల్హేటి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. కుమార్తె వివాహం కోసం ఒ కుటుంబం.. బంధువులతో సహా డీసీఎంలో తికంగఢ్ లోని జతారాకు బయల్దేరారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.