AP

వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఏపీ ఆ తర్వాత అధిష్టానం తప్పిదాల కారణంగా ఉనికికే ముప్పు

ఒకప్పుడు వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఏపీ ఆ తర్వాత అధిష్టానం తప్పిదాల కారణంగా ఉనికికే ముప్పు తెచ్చుకుంది. విభజన కారణంగా ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, తెలంగాణలోనూ అధికారం కోసం అష్టకష్టాలు పడుతోంది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీతో ఉనికి చాటుకునేందుకుప్రయత్నిస్తున్న వైఎస్సార్ కూతురు షర్మిలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకోవడం ద్వారా గట్టెక్కాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. షర్మిల చేరికకు రంగం కూడా సిద్ధమైనట్లు, ఇందులో భాగంగా వైఎస్ సమాధి ఉన్న ఇడుపులపాయకు సోనియా-రాహుల్ వస్తారనే ప్రచారం నెలకొంది.

దీనిపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ ఇవాళ కుండబద్దలు కొట్టేశారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో రెండుసార్లు భేటీ అయిన షర్మిల ఢిల్లీ వెళ్లి రాహుల్ తో భేటీ కాబోతున్నట్లు, ఆ తర్వాత విలీనం ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చింతామోహన్ స్పందించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని చింతామోహన్ తేల్చిచెప్పారు.

అలాగే కాంగ్రెస్ అగ్ర నేతలు ఎవరూ కూడా షర్మిల కోసం ఇడుపులపాయకు రావటం లేదని చింతామోహన్ వెల్లడించారు. ఈ ప్రచారం అంతా ఒట్టి అబద్ధమన్నారు. గతంలో వైఎస్సార్ ను నెత్తిన పెట్టుకొని కాంగ్రెస్ తప్పు చేసిందని, అదే పొరపాటు ఈసారి చేయదలచుకోవడం లేదన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డికి కూడా కూతుర్లు ఉన్నారని, వారు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చని చింతా మోహన్ పేర్కొన్నారు. వారెంతో షర్మిల కూడా అంతే అన్నారు.

షర్మిలను ప్రత్యేకంగా నెత్తిన పెట్టుకొని నాయకత్వాన్ని అప్పగించడం జరగదని చింతామోహన్ తేల్చిచెప్పేశారు. షర్మిల విషయంలో జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమే అని చింతామోహన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని తాజాగా తప్పుబట్టారు. చివరి శ్వాస వరకూ తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాథాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయని షర్మిల ఈ మధ్యే ఆరోపించారు. చింతామోహన్ కూడా ఇప్పుడు అదే చెప్పారు.