గత కొన్ని రోజులుగా తెలంగాణ(Telangana) బీజేపీ(BJP)లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న భువనగిరి నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి(Jitta Balakrishna Reddy)ని సస్పెండ్ చేసింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.
పార్టీ వ్యతిరేక కార్యక్రమలకు పాల్పడుతున్నాడు అంటూ బాలకృష్ణని సస్పెండ్ చేశారు.
అయితే అకారణంగా తెలంగాణ ఉద్యమకారుడినైనా తనను బీజేపీ నుండి సస్పెండ్ చేశారని, ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని బీజేపీకి రెండు రోజులు సమయం ఇవ్వగా బీజేపీ నేతలు ఎవ్వరూ స్పందించకపోవడంతో నేడు గన్ పార్క్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జిట్టా బాలకృష్ణారెడ్డి.
జిట్టా బాలకృష్ణారెడ్డి.. కిషన్ రెడ్డి పచ్చి సమైక్యవాది. కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్ రెడ్డి నన్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశాడు. పార్టీలో మరో నాయకుడు ఎదగొద్దనేది కిషన్ రెడ్డి ఆలోచన. ఎన్నికల తర్వాత ఇతర పార్టీలను చీల్చి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఈ కుట్రలో భాగంగానే బీజేపీని బలోపేతం చేసిన బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించారు. ఈటల రాజేందర్ బీజేపీని బలహీన పరిచాడు. అమిత్ షా, జేపీ నడ్డాలను తిట్టిన రఘునందనరావును కిషన్ రెడ్డి సంకలో పెట్టుకుని తిరుగుతున్నాడు. నన్ను సస్పెండ్ చేసేకంటే ముందు రఘునందనరావు, ఈటల, ఏ.చంద్రశేఖర్, రవీందర్ నాయక్ లను సస్పెండ్ చేయాలి. కేసీఆర్ తో ఒప్పందంలో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని మునుగోడులో బలిపశువును చేశారు. కవిత లిక్కర్ స్కాం కేసు నిర్వీర్యం చేశారు. బీజేపీని హైదరాబాద్ కే పరిమితం చేసిన ఘనత కిషన్ రెడ్డిదే. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ రాజసింగ్ పై సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయటం లేదు అని వ్యాఖ్యానించారు.
దీంతో జిట్టా వ్యాఖ్యలు బీజేపీలో సంచలనంగా మారాయి. ఇక జిట్టా త్వరలో కాంగ్రెస్ లో చేరతారని సమాచారం.