World

20 బంతుల్లో 1 పరుగు.. 3 వికెట్లు

ఆస్ట్రేలియా యువ పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ సంచలన స్పెల్‌తో మెరిశాడు. ది హండ్రెడ్‌ లీగ్‌లో అరంగేట్రంలోనే అత్యద్భుత గణాంకాలు నమోదు చేశాడు.

20 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లండ్‌ హండ్రెడ్‌ లీగ్‌లో జాన్సన్‌ ఓవల్‌ ఇన్విసిబుల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో లండన్‌లోని కెన్నింగ్‌టన్‌ ఓవల్‌ వేదికగా మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20 జట్టుకు ఎంపికైన మరుసటి రోజే 20 డెలివరీల్లో 19 డాట్‌ బాల్స్‌ వేసి సంచలనం సృష్టించాడు.

మాంచెస్టర్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌.. జాన్సన్‌ వేసిన షార్ట్‌ బంతిని డీప్‌ స్వ్కేర్‌ లెగ్‌ దిశగా ఆడి అతడి బౌలింగ్‌లో ఆ ఒక్క సింగిల్‌కు కారణమయ్యాడు. వేసిన పదకొండో బంతికి ఉసామా మిర్‌ను అవుట్‌ చేసితొలి వికెట్‌ తీసిన జాన్సన్‌.. ఆ తర్వాత టామ్‌ హార్ట్లీ, జాషువా లిటిల్‌లను పెవిలియన్‌కు పంపాడు.

ఓవల్‌ ఇన్విసిబుల్‌ బౌలర్లు గస్‌ అట్కిన్సన్‌ రెండు, నాథన్‌ సోవటెర్‌ రెండేసి వికెట్లు తీయగా.. స్పెన్సర్‌ జాన్సర్‌తో పాటు సునిల్‌ నరైన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. సొంతమైదానంలో ఓవల్‌ బౌలర్ల విజృంభణతో పర్యాటక మాంచెస్టర్‌ జట్టు 89 బంతులాడి 92 పరుగులకే కుప్పకూలింది.

దీంతో.. జేసన్‌ రాయ్‌(59), హెన్రిచ్‌ క్లాసెన్‌(60) అర్ధ శతకాలతో మెరవడంతో 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసిన ఓవల్‌ జట్టు భారీ విజయం సాధించింది. మ్యాచ్‌లో మాంచెస్టర్‌పై 94 పరుగుల తేడాతో నెగ్గింది.