World

కీలక విషయాలు వెల్లడించిన వుహాన్ ల్యాబ్ సైంటిస్ట్

కొవిడ్-19.. సుమారు రెండు సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది. కోట్లాది మంది ప్రాణాలను బలిగొంది. ఆర్థిక వ్యవస్థలను కూడా కుప్పకూల్చింది. అయితే ఇంత ప్రబలంగా వ్యాపించిన కొవిడ్-19 ఎక్కడ, ఎలా పుట్టిందన్న విషయంపై ఇంత వరకు స్పష్టం రాలేదు. చైనాలోని వుహాన్ ల్యాబ్‍ (Wuhan Lab) లోనే ఇది తయారైందని ఇది వరకు కొన్ని అంచనాలు వచ్చాయి. మరికొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా వుహాన్ ల్యాబ్‍లో పని చేసిన ఓ అమెరికా శాస్త్రవేత్త సంచలన విషయాలు వెల్లడించారు. ది ట్రూత్ అబౌట్ వుహాన్ (The Truth about Wuhan) పేరుతో రచించిన పుస్తకంలో కీలక అంశాలను పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇవే.. వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ Covid – Man Made Virus: కొవిడ్.. చైనాలోని వూహాన్ ల్యాబ్‍ నుంచి బయటికి వచ్చిన మ్యాన్-మేడ్ (మనుషులు తయారు చేసిన) వైరస్ అని ఆ ల్యాబ్‍లో గతంలో పని చేసిన అమెరికా ఎపిడెమియాలజిస్ట్ అండ్రూ హఫ్ (Andrew Huff) పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను బ్రిటిష్ న్యూస్ పేపర్ ది సన్ రిపోర్ట్ చేసింది. ది ట్రూత్ అబౌట్ వుహాన్ అనే బుక్‍లో ఆయన కీలకమైన విషయాలను వెల్లడించారని పేర్కొంది. అమెరికా పాత్ర! Covid – Man Made Virus: గతంలోని కరోనా వైరస్‍ల గురించి పరిశోధన చేసేందుకు వుహాన్ ల్యాబ్‍కు అమెరికా నిధులు సమకూర్చిందని, ఆ పరిశోధనల్లో భాగంగానే ఈ కొవిడ్-19 ఆ ల్యాబ్ నుంచి లీకైందని హఫ్ ఆ బుక్‍లో పేర్కొన్నారని ది సన్ రిపోర్టులో ఉంది. 9/11 నుంచి అమెరికా ఇంటెలిజెన్స్ విఫలమవుతూనే ఉందని ఆ సైంటిస్ట్ ఆరోపించారు. “చాలా విదేశీ ల్యాబొరేటరీల్లో సరైన బయో సేఫ్టీ, బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‍మెంట్ లేదు. ఈ విధంగా వుహాన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV) నుంచి వైరస్ లీక్ అయింది” అని ఆ పుస్తకంలో హఫ్ వెల్లడించారు. చైనాలోని కరోనా వైరస్‍ల గురించి పరిశోధనలు చేసేందుకు వుహాన్ ల్యాబ్‍కు అమెరికా ఫండింగ్ చేసిందని సైంటిస్ట్ హఫ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. కొవిడ్-19 వుహాన్‍లోనే పుట్టిందని గతంలో చాలా మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే చైనా ఈ విషయాన్ని ఖండిస్తూనే వస్తోంది. కొవిడ్-19 ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై డబ్ల్యూహెచ్‍వో చేపట్టిన దర్యాప్తును కూడా చైనా అడ్డుకుంటోంది. గతంలో గబ్బిలాల నుంచి కొన్ని కరోనా వైరస్ రకాలు వ్యాపించాయని పరిశోధనల ద్వారా తేలింది. అయితే కొవిడ్-19 కూడా అలాగే పుట్టిందని కొందరు అంచనా వేశారు. అయితే వుహాన్ ల్యాబ్‍లోనే కొవిడ్-19 సృష్టి జరిగిందని, అక్కడి నుంచే లీక్ అయిందని చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ల్యాబ్‍లో పని చేసిన ఓ సైంటిస్ట్ కూడా ఇలాంటి విషయాన్నే వెల్లడించారు.