ఉండవల్లి శ్రీదేవి తెలుసు కదా. ఆమెది గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో ఆమె ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు.
ఆమె గెలిచినప్పటి నుంచి పార్టీలో అంతర్గత విభేదాలు ప్రారంభమయ్యాయి. సొంత పార్టీ నేతలపైనే ఆమె తన అసమ్మతి రాగాన్ని వినిపించారు. వైసీపీ అధిష్ఠానంపై కూడా ఆమె గుర్రుగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి కాకుండా.. టీడీపీకి శ్రీదేవి ఓటేసినట్టు తేలడంతో పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఇక ఆమె టీడీపీలో చేరడం అధికారికం అయింది. ఆ తర్వాత వైసీపీ ముఖం కూడా చూడలేదు. తన సొంత నియోజకవర్గంలోనూ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పర్యటించలేదు కానీ.. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మాత్రం తాను పాల్గొన్నారు. తాడికొండకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేరుకున్నప్పుడు ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే.. అమరావతి రైతులకు కూడా ఆమె క్షమాపణలు చెప్పారు. చివరకు తాను టీడీపీలో చేరుతున్నట్టు కన్ఫమ్ చేశారు.
అయితే.. తనకు వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా ముందు భావించారు. ఎందుకంటే.. తను వైసీపీ తరుపున 2019 ఎన్నికల్లో తాడికొండ నుంచే గెలిచారు కాబట్టి. కానీ.. ప్రస్తుతం ఆమెకు అక్కడ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని టీడీపీ సర్వేలో తేలడంతో ఇక తనను తిరువూరు నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోందట. కానీ.. శ్రీదేవికి మాత్రం తాడికొండ నుంచే పోటీ చేయాలని ఆసక్తి ఉంది. తను ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. కానీ.. తనకు చంద్రబాబు టీడీపీ సీటు ఇస్తారా లేదా అనేది డౌటే. తాడికొండలో టీడీపీ ఇన్ చార్జ్ తెనాలి శ్రావణ్ కుమార్ కు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆమెను తిరువూరులో నిలబెట్టాలని భావిస్తున్నారట. తిరువూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన కేఎస్ జవహర్ కు కొవ్వూరు టికెట్ ఇచ్చి.. తిరువూరు నుంచి ఉండవల్లి శ్రీదేవిని పోటీ చేయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.