TELANGANA

ఏ కులపోళ్లైనా సరే.. మీరు లీడర్లు కాదు.. ఓటర్లు.. కేసీఆర్ చెబుతోంది అర్థమవుతోందా?

అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు రాశారు? బలహీన వర్గాలు కూడా రాజ్యాన్ని పాలించాలని.. మరి క్షేత్రస్థాయిలో అలా జరుగుతోందా? అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందా?

అన్నేసి అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వారు ఆయన బోధించిన విలువలను పాటిస్తున్నారా? ఆయన సూచించిన విషయాలను అమలు చేస్తున్నారా? అంటే వీటికి నో అనే సమాధానం వస్తుంది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార భారత రాష్ట్ర సమితి ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే పై విషయమే స్పష్టంగా అర్థమవుతుంది.

బీసీల జనాభా ఎక్కువ

వాస్తవానికి తెలంగాణ సమాజంలో బీసీల జనాభా ఎక్కువ. ఆ తర్వాత స్థానంలో దళితులు ఉంటారు. రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే సింహభాగం సీట్లు వీరికే దక్కాలి. జనాభా దమాషా ప్రకారం చూసుకున్నా వీరికే అగ్ర తాంబూలం చెందాలి. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. రాష్ట్రంలో జనాభా నిష్పత్తి పరంగా చూసుకుంటే అతి తక్కువ స్థాయిలో ఉన్నవారికి టికెట్ దక్కడం కెసిఆర్ మార్కు రాజకీయానికి అడ్డంపడుతోంది. టికెట్లలో ఎక్కువగా రెడ్లకు కేటాయించడం, ఆ తర్వాత వెలమలకు దక్కేలా చూడటం కెసిఆర్ పాటించిన టికెట్ల విధానం.. గతంలో పద్మశాలీలు సమావేశం నిర్వహించారు. ముదిరాజులు మీటింగ్ లు పెట్టాలనుకున్నారు. అన్ని పార్టీలు కలిసి బీసీలకు సింహభాగం సీట్లు ఇవ్వాలని తీర్మానించుకున్నారు. కానీ అన్ని సీట్లు ఇవ్వకుండా భారత రాష్ట్ర సమితి అధినేత ముష్టి వేసినట్టు జరిపారని బీసీ సంఘాల నాయకులు అంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత

ఇక మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వామపక్ష పార్టీల సహకారం కోరిన కేసీఆర్.. సాధారణ ఎన్నికల్లో వారితో పొత్తు ఉంటుందని ప్రకటించినా.. వారు కోరుకుంటున్న స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించి మొండి చేయి చూపారు. ఇక 20 నుంచి 25 మంది భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ లను మారుస్తారని ప్రచారం మొదటినుంచి జరిగింది. పార్టీ తరఫున చేయించిన సర్వేల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలో పలువురు రెండుసార్లు గెలిచినవారు ఉండగా.. మరికొందరు మూడుసార్లు గెలుపొందిన వారు కూడా ఉన్నారు. దీంతో వారిపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడటం పాటు రాజకీయంగాను సొంత పార్టీలోనే వారి పట్ల అసంతృప్తులు, అసమ్మతులు పెరిగిపోయాయి. క్షేత్రస్థాయిలో ఇంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో సిట్టింగ్ల వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. సిట్టింగ్ ల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గడంతో పాటు వారికి సీటు ఇవ్వకుంటే పార్టీ మారతారని ఆందోళన కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం పై సానుకూలత ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరన్నది కాకుండా ముఖ్యమంత్రిగా తనను చూసి, పార్టీని చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేస్తారని ఉద్దేశంతో ఆయన ఉన్నారని తెలుస్తోంది.

58 మంది వారే

కెసిఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సగం మంది ఓసిలే ఉన్నారు. మొత్తం 115 మంది అభ్యర్థుల్లో 58 మంది ఓసి అభ్యర్థులే. ఇందులో రెడ్డి సామాజిక వర్గం వారు 40 మంది, వెలమ సామాజిక వర్గం వారు 11 మంది, కమ్మ సామాజిక వర్గం వారు ఐదుగురు, బ్రాహ్మణులు, వైశ్యులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. బీసీల నుంచి 23 మందికి అవకాశం కల్పించారు. అన్ని పార్టీలు బీసీలకు సీట్లు పెంచాలంటూ డిమాండ్లు చేసినప్పటికీ దానిని కేసీఆర్ లెక్కపెట్టలేదు. ఇక టికెట్ల విషయంలో అసంతృప్తులు, అలకలు రాకుండా ఉండేందుకు కేసిఆర్, హరీష్ రావు వారం పది రోజుల నుంచి తీవ్ర కసరత్తు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జాబితా ప్రకటించిన తర్వాత అసంతృప్తులు బాహాటంగానే విమర్శలు చేయడం ప్రారంభించారు. ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటుండగా.. కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తి వెల్లగక్కారు.