మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేకను ఎత్తుకెళ్లాడంటూ ఓ దళిత యువకుడిని తలకిందులుగా వేలాడదీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఈ ఘటన మందమర్రిలో సెప్టెంబర్ 2న జరిగింది. మందమర్రిలోని యాపల్ ప్రాంతానికి చెందిన రాములు, స్వరూప దంపతులకు కొడుకు శ్రీనివాస్ ఉన్నారు. వీరు రైల్వే ట్రాక్ సమీపంలో ఓ షెడ్డు ఏర్పాటు చేసుకుని మేకలను పెంచుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం తమ షెడ్డులో ఉన్న ఓ మేక కనిపించకుండా పోయింది.
ఆ మేకను ఆ ప్రాంతానికే చెందిన కూలీ పనులు చేసే చిలుముల కిరణ్ అనే వ్యక్తి మేకను ఎత్తుకెళ్లాడని రాములు కుటుంబ సభ్యులు అనుమానపడ్డారు. వెంటనే కిరణ్ షెడ్డులోకి తీసుకొచ్చి మేకను ఎత్తుకెళ్లింది నువ్వేనా అని అడిగారు. దానికి కిరణ్ తాను కాదని సమాధానం చెప్పాడు. దీంతో కిరణ్ ను షెడ్డు తలకిందులుగా వేలాడిదీసి కట్టేశారు. కొట్టారు కూడా. మేక ఎంత పలుకుతుందో అంత డబ్బులు ఇవ్వాలని రాములు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో తాను డబ్బులు ఇస్తానని కిరణ్ ఒప్పుకున్నాడు.
దీంతో అతన్ని విడిచిపెట్టారు. శుక్రవారం సాయంత్ర నుంచి కిరణఅ కనిపించడం లేదని అతని చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం మందమర్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి కిరణ్ కోసం గాలిస్తున్నారు. అయితే కిరణ్ కట్టేసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో కిరణ్ కట్టేసి కొట్టిన రాములు కుటుంబ సభ్యులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, టౌన్ ఎస్సై చంద్రకుమార్ పరిశీలించారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే జిల్లాలో ఓ దళితుడిని కులం పేరుతో దూషిస్తూ కట్టేసి కొట్టిన ఘటన చోటుచేసుకుంది.