AP

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు..

తగిన సాక్ష్యాధారాలతో సహా.

ఈ తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

ఈ పరిణామాలపై తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు ఎన్ రఘునందన్ రావు స్పందించారు. భారత్ ఓ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, గతంలో ఎంతోమంది అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారు. అనేకమంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల కుటుంబ సభ్యులు అరెస్టులు అయ్యారని పేర్కొన్నారు.

ఎన్నికల సంవత్సరంలోకి ప్రవేశించిన తరువాత, ఇంకో రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ వెలువడే పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేశారంటే అది సాహసమే అవుతుందని వ్యాఖ్యానించారు రఘునందన్. అలాంటి సాహసం చేయడానికి పాలక పక్షం వద్ద సరైన సాక్ష్యాధారాలు ఉంటేనే అలాంటి పని చేస్తారని అన్నారు.

అంతే గానీ- ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసి, ఆ పార్టీకి వచ్చేలా చేయరని తాను అనుకుంటున్నట్లు రఘునందన్ వ్యాఖ్యానించారు. సాక్ష్యాధారాలు ఉంటేనే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉండొచ్చని, అంతమాత్రాన సింపతి వస్తుందని తాను అనుకోవట్లేదని చెప్పారు.