AP

జగన్ సర్కార్ కు ఈసీ భారీ షాక్..!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ వైసీపీ ప్రభుత్వానికి భారీ షాకిచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో అధికారులు అధికార పార్టీ మాట విని అక్రమాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణకు వచ్చిన ఈసీ.. విజయవాడలో నిర్వహించిన సమీక్షలో అక్షింతలు వేసింది. తటస్ధంగా ఉంటారా లేదా అని ప్రశ్నించింది. దీంతో కలెక్టర్లు, ఎస్పీలు ఇరుకునపడ్డారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

 

రాష్ట్రంలో ఎన్నికల విధులకు వైసీపీ ప్రభుత్వం సచివాలయాల సిబ్బందిని బీఆల్వోలు, ఇతర అధికారులుగా నియమిస్తోంది. గతంలో టీచర్లు నిర్వహించిన ఈ విధుల్ని వారికి దూరం చేసింది. టీచర్లకు బోధనేతర విధులు అప్పగించరాదని తీసుకున్న నిర్ణయంలో భాగంగా వీరికి ఎన్నికల విధుల నుంచి తప్పించింది. దీంతో గతంలో వద్దన్నా విధులు అప్పగించి ఇప్పుడు హఠాత్తుగా తమకు నష్టం జరుగుతుందన్న భయంతో తమను ఎన్నికల విధుల నుంచి తప్పించడమేంటని వారు ఆగ్రహంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్ని సచివాలయాల సిబ్బంది సాయంతోనే నిర్వహించేలా వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. కానీ విజయవాడలో నిర్వహించిన తాజా సమీక్షలో సచివాలయాల సిబ్బంది ఎన్నికల విధులకు సరిపోరనే అంచనాకు వచ్చిన ఈసీ టీచర్లను సైతం ఎన్నికల విధులకు అనుమతిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ ప్రభుత్వం కోరుకోని టీచర్లు ఇప్పుడు ఎన్నికల విధులు నిర్వహించబోతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వోద్యోగులు అనుకూలంగా ఉండాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది. కానీ ఇప్పుడు ఈసీ నిర్ణయంతో పరిస్ధితి మొత్తం మారిపోయింది.