ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో చంద్రబాబుని అరెస్టు చేసి జైలుకు పంపించిన తర్వాత టిడిపి వైసిపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
తాజాగా రంగంలోకి దిగిన టిడిపి నేత, హిందూపురం ఎమ్మెల్యే , సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ను జైలుకు పంపాలన్న కుట్రతో లేని స్కాములు సృష్టించారని ఆరోపణలు గుప్పించారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై కేసు పెట్టారని, ఎలాంటి ఆధారాలు లేకున్నా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు.
ఎన్ని కేసులు పెట్టినా సరే న్యాయ పోరాటం చేస్తాం తప్ప ఎవరికీ భయపడేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజల కోసం టిడిపి తరఫున చేస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఆపలేరని చెప్పిన బాలకృష్ణ వచ్చే ఎన్నికలలో పరాజయం తప్పదన్న ఉద్దేశంతోనే జగన్ కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. తెలుగుజాతి పౌరుషాన్ని చూపిస్తామని ఈ సందర్భంగా బాలయ్య పేర్కొన్నారు
ఇక బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఏపీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తండ్రి మోసపోతే పౌరుషాన్ని చూపని నువ్వు ! తెలుగు జాతి పౌరుషాన్ని చూపిస్తావా ? అంటూ మండిపడ్డారు. గతంలో బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ ను చంద్రబాబు మోసం చేశారని నాటి సంఘటనను గుర్తు చేశారు. అంతేకాదు పో …పోవయ్యా …బాలయ్య ! అంటూ అంబటి బాలకృష్ణకు సెటైర్లు వేశారు.
బాలయ్య మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టు అంబటి రాంబాబు తన పోస్ట్ ద్వారా పేర్కొన్నారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ ను కూడా అంబటి రాంబాబు టార్గెట్ చేశారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి తోడుపడవోయి అని నాడు గురజాడ అంటే సొంత పార్టీని సర్వ నాశనం చేసుకుని పొరుగు పార్టీని బ్రతికించవోయ్ అని నేడు పవన్ కళ్యాణ్ అంటున్నాడని పేర్కొన్నారు.