అక్లాండ్: భూగోళం మీద ఏడు ఖండాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. దీని ఆధారంగానే మ్యాప్స్ తయారయ్యాయి. ఈ ఏడు ఖండాల ఆధారంగా దేశాలను విభజించారు. టైమ్ జోన్లు ఏర్పడ్డాయి.
ఇప్పుడు కొత్తగా మరో ఖండం తెర మీదికి వచ్చింది. 2017లో భూగర్భ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. తాజాగా ఈ ఖండాన్ని పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేశారు. దాని విస్తీర్ణాన్ని వెల్లడించారు. కొత్త మ్యాప్‌ను విడుదల చేశారు.
దీని పేరు జిలాండియా. 94 శాతం సముద్రంలో మునిగిపోయిన ఖండం ఇది. ఆరు శాతం భూభాగం మాత్రం న్యూజిలాండ్ పరిసరాల్లో విస్తరించి ఉంది. 375 సంవత్సరాల కిందటే దీన్ని కనుగొన్నప్పటికీ.. దీన్ని పూర్తిస్థాయిలో మ్యాపింగ్ చేయలేకపోయారు. సముద్రంలో మునిగిపోయి ఉండటం వల్ల అది సాధ్యపడలేదు.
ఇప్పుడు సముద్రపు అడుగు భాగంలోని రాతి ఫలకాల నమూనాల డేటాను ఉపయోగించి.. జిలాండియాను ఖండంగా గుర్తించారు. దీని విస్తీర్ణాన్నీ ఖరారు చేశారు. జిలాండియా ఖండం విస్తీర్ణాన్ని 50 లక్షల చదరపు కిలోమీటర్లుగా తేల్చారు. ఆఫ్రికా ఖండంలోని మడగాస్కర్ ద్వీపం కంటే దీని విస్తీర్ణం ఆరు రెట్లు అధికం. మడగాస్కర్ విస్తీర్ణం 5,86,884 చదరపు కిలోమీటర్లు.
మొత్తంగా ప్రపంచంలోనే అతి చిన్న ఖండంగా జిలాండియాను గుర్తించనున్నట్లు న్యూజిలాండ్ క్రౌన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ యాండీ టులోక్ తెలిపారు. 55 కోట్ల సంవత్సరాల కిందట గోండ్వానా సూపర్ కాంటినెంట్‌లో ఓ భాగంగా ఉండేది ఈ జిలాండియా. 10.5 కోట్ల సంవత్సరాల కిందట ఇది విడిపోవడం మొదలుపెట్టింది. 1642లో మొట్టమొదటిసారిగా అబెల్ టాస్మాన్ అనే ఓ డచ్ వ్యాపారవేత్త ఈ ఖండాన్ని కనుగొన్నారు.
ఇప్పుడున్న ఏడు ఖండాలకు ఉన్న నాలుగు సహజ లక్షణాల ఆధారంగా జిలాండియానూ ఓ ఖండంగా గుర్తించినట్లు క్రౌన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. సముద్ర మట్టం నుంచి సంబంధిత ఖండం ఎత్తు, జియాలాజికల్ స్ట్రక్చర్స్.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మ్యాపింగ్ చేశారు.
దీని ఆధారంగానే కొత్త మ్యాప్‌ను విడుదల చేసినట్లు https://phys.org/ అనే సైన్స్ వెబ్‌సైట్ వెల్లడించింది. జిలాండియా ఖండంలోని మాగ్నెటిక్ ఆర్క్ యాక్సిస్ స్థానాన్ని మాత్రమే కాకుండా ఇతర ప్రధాన భౌగోళిక లక్షణాలు, విస్తీర్ణం, వాటి లక్షణాలను కూడా ఈ కొత్త మ్యాప్‌లో ప్రచురించారు.