అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ పరిణామాలన్నింటిపై జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడిందినప్పకీ ఆ వ్యూహం బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ప్రతిపక్షాలను రాజకీయ దురుద్దేశాలతో వేధింపులకు గురి చేస్తోందనే అంశాన్ని జాతీయ మీడియా దృష్టికి వివరించే ప్రయత్నం చేశారు గానీ అది ఫలప్రదం కాలేదు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సుదీర్ఘకాలం పాటు ఢిల్లీలోనే గడుపుతున్నారు. కిందటి నెల 14వ తేదీన రాత్రి ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్.. ఈ రోజు వరకూ అక్కడే ఉంటోన్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పర్యవేక్షిస్తోన్నారు.
ఒకరకంగా టీడీపీకి నాయకత్వ లేమి అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తోందిక్కడ. చంద్రబాబు జైలులో ఉండటం, నారా లోకేష్ ఢిల్లీ నుంచి కదలకపోవడం వంటి పరిణామాలు దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మోత మోగిద్దాం కార్యక్రమంలో కూడా లోకేష్ ఢిల్లీ నుంచే పాల్గొన్నారు. గంట మోగించి నిరసన తెలిపారు.
దీనిపై వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయిరెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లేమి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు అవినీతి కేసులో జైలుపాలైనప్పటికీ పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోందని అన్నారు.
రాజధాని అమరావతి గ్రామాల్లో తీవ్ర కలకలం: మంగళగిరిలో ఎన్ఐఏ విస్తృత సోదాలు: పక్కా సమాచారం
పార్టీని సరైన దిశలో నడిపించే నాయకుడు లేకపోవడం వల్ల త్వరలోనే టీడీపీ రెండు, మూడు ముక్కలుగా చీలిపోవచ్చని విజయసాయిరెడ్డి అన్నారు. 40 సంవత్సరాలుగా పార్టీకి మద్ధతిస్తున్న బలమైన వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైందంటూ బాంబు పేల్చారు. చంద్రబాబు సాగించిన దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారని, అది పార్టీ చీలికకు దారి తీస్తుందని పేర్కొన్నారు.