National

అదానీ గ్రూపు అక్రమాలపై పోరాడుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ మరో సంచలన ఆరోపణ

అదానీ గ్రూపు అక్రమాలపై పోరాడుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ మరో సంచలన ఆరోపణ చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్ లో వచ్చిన ఓ కథనాన్ని ఆధారంగా చేసుకుని రాహుల్ అదానీ గ్రూపును టార్గెట్ చేశారు.

విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధరల్ని అధికంగా చూపి ప్రజలకు 12 వేల కోట్ల మేర అదనపు కరెంటు బిల్లుల మోత మోగిస్తోందని రాహుల్ ఆరోపించారు. దీనిపై ప్రధాని మోడీ మౌనాన్ని కూడా రాహుల్ ప్రశ్నించారు.

అదానీ గ్రూపు విదేశీ బొగ్గు దిగుమతుల ధరలు అధికంగా చూపిస్తూ కరెంటు బిల్లుల్లో 12 వేల కోట్ల మేర దోపిడీ చేస్తోందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మార్కెట్ ధరల కన్నా అధికంగా చూపిస్తూ అదానీ గ్రూపు ఈ దోపిడీకి పాల్పడుతోందని రాహుల్ ఆరోపించారు. అయినా ప్రధాని మోడీ తన అధికారంతో అదానీ గ్రూపును కాపాడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా దీనిపై విచారణకు ఆదేశించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు.

ఇండోనేషియా నుంచి అదానీ గ్రూపు దిగుమతి చేసుకుంటున్న బొగ్గు.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సరికి దాని ధర రెట్టింపు అవుతోందని రాహుల్ ఆరోపించారు. దీంతో భారత్ లో విద్యుత్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోందని, అధిక బిల్లులతో జనం జేబులకు చిల్లు పడుతోందన్నారు. ఇలా మరో దేశంలో జరిగితే ప్రభుత్వాలు కుప్పకూలుతాయని, కానీ భారత్ లో మాత్రం కనీసం చర్యలు కూడా తీసుకోవడం లేదన్నారు. అదానీ గ్రూపును ఎవరు రక్షిస్తున్నారో దేశ ప్రజలకు తెలుసని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎవరి అధికారంతో అదానీ గ్రూపు సురక్షితంగా ఉందో తెలుసన్నారు.

అదానీ గ్రూపు అక్రమాలపై ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయని, అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ గ్రూపు కూడా అక్రమాలను నిర్ధారించిందని రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ తాజా ఆరోపణలపై అదానీ గ్రూపు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.