TELANGANA

నామినేషన్ల ప్రక్రియ.. రూల్స్ ఇవే..!

తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రారంభకావడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ కీలక విషయాలు వివరించారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందన్నారు. డిపాజిట్ మాత్రం ఒక్క సెట్ కే చెల్లించాలని చెప్పారు. అఫిడవిట్‌లోని కాలమ్స్ అన్నీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

 

అక్టోబరు 31 వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబర్ 10కి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా 9.10 లక్షల మంది యువత ఓట హక్కు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఓటర్ ఇన్‌ఫర్మేషన్‌ స్లిప్పులు ముందుగానే పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

 

పోలింగ్ ఏర్పాట్లను వికాస్ రాజ్ వెల్లడించారు. 2 వేల పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గతంలో పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉందన్నారు. ఈ సారి పట్టణ ప్రాంతాల్లోనూ ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం 18 వేల వీల్‌ఛైర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నవంబర్‌ 30న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుందని తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లో ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.

 

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను వికాస్ రాజ్ వివరించారు. రాష్ట్రంలో 205 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు రూ.453 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మొత్తం 362 కేసులు, 256 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని వెల్లడించారు. సీవిజిల్ యాప్ ద్వారా 2,487 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వివిధ కార్యక్రమాల అనుమతుల కోసం 9,630 దరఖాస్తులు వచ్చాయన్నారు. స్వాధీనం చేసుకున్న నగదుకు ఆధారాలు ఉంటే జిల్లా కమిటీల ద్వారా త్వరగా విడుదల చేయాలని ఆదేశించామన్నారు. వీలైనంత వరకు సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే మార్గదర్శకాలు జారీ చేశామని సీఈవో వికాస్‌ రాజ్‌ స్పష్టం చేశారు.

 

ఇప్పటివరకు 137 ఎంసీసీ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయని వికాస్ రాజ్ తెలిపారు. 13 బీఆర్ఎస్, 16 కాంగ్రెస్, 5 బీజేపీ, 3 బీఎస్పీకి సంబంధించి అనుమానిత కేసులు ఉన్నాయన్నారు. రైతుబంధు విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని స్పష్టం చేశారు. ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే ఎన్నికల సంఘం లక్ష్యమన్నారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆయా విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి వస్తాయని తెలిపారు. నవంబర్ 2 నాటికి ఓటర్ల సంఖ్య 3,21,88,753గా ఉందని సీఈవో వెల్లడించారు.