తెలంగాణలో రాజకీయంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో సామాజిక, ఆర్థిక, కుల గణనపై చర్చ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
కుల సర్వేను మొత్తం నాలుగు భాగాలుగా విభజించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వాటిలో మొదటి మూడు భాగాలను సభలో ప్రవేశపెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. నాలుగో భాగంలో పౌరుల వ్యక్తిగత సమాచారం ఉన్నందున, వ్యక్తిగత గోప్యత చట్టం ప్రకారం దానిని సభలో ప్రవేశపెట్టలేమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏ, బీ, సీ, డీ, ఈ వర్గాలుగా ఉన్న బీసీల మొత్తం జనాభా రాష్ట్రంలో 56.33 శాతంగా ఉందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ఓసీలను 20 శాతానికి పైగా చూపించిందని, ప్రస్తుత కుల సర్వే ప్రకారం ఓసీల జనాభా 15 శాతంగానే ఉందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ సర్వేలో బీసీలు 51 శాతంగా ఉంటే, తమ కుల సర్వేలో అది 56 శాతానికి పెరిగిందని ఆయన వివరించారు.
గత ప్రభుత్వం అటెండర్లతో కూడా సర్వే చేయించిందని ముఖ్యమంత్రి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు గోప్యంగా ఉంచిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆ సర్వేను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు. గత ప్రభుత్వ సర్వేతో పోల్చితే తాము చేపట్టిన కుల సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీల శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి ప్రకటన
ఎస్సీ వర్గీకరణ కమిషన్ సారాంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఎస్సీలలో మొత్తం 59 ఉపకులాలను వర్గీకరణ కమిషన్ గుర్తించిందని ఆయన తెలిపారు. ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫార్సు చేసిందని ఆయన చెప్పారు. ఎస్సీ కులాలను గ్రూప్ 1, 2, 3లుగా వర్గీకరించాలని సిఫార్సు చేసిందని, మొత్తం 15 శాతం ఎస్సీ రిజర్వేషన్‌ను ఈ మూడు గ్రూపులకు పంచుతూ సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు.
గ్రూప్-1లోని 15 ఉపకులాలకు 1 శాతం, గ్రూప్-2లోని 18 ఉపకులాలకు 9 శాతం, గ్రూప్-3లోని 26 ఎస్సీ ఉపకులాలకు 5 శాతం రిజర్వేషన్‌ను కమిషన్ సిఫార్సు చేసిందని ఆయన తెలిపారు.
గ్రూప్-1లోని 15 ఎస్సీ ఉపకులాల జనాభా 3.288 శాతం, గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉపకులాల జనాభా 62.748 శాతం, గ్రూప్-3లోని 26 ఎస్సీ ఉపకులాల జనాభా 33.963 శాతం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.