TELANGANA

ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీలో 9 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 2018 ఎన్నికల్లో ఎంఐఎం ఏడు స్థానాల్లో గెలిచింది. ఆ ఏడు సిట్టింగ్‌ స్థానాల్లో తిరిగి పోటీ చేస్తోంది. మరో రెండు స్థానాల్లో పోటీ చేస్తామని అసదుద్దీన్ వెల్లడించారు.

 

చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా, బహుదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్ , మలక్ పేట ఎంఐఎం సిట్టింగ్ స్థానాలు. వీటితోపాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో పోటీ చేస్తామని ఓవైసీ తెలిపారు.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. బీఆర్ఎస్ 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ గోషామహల్, చార్మినార్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు.

 

ఇటు కాంగ్రెస్ కూడా ఎన్నికల రణరంగంలో దూసుకుపోతోంది. రెండు జాబితాల్లో మొత్తం 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు రాహుల్ గాంధీ వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటూ పార్టీలో జోష్ తీసుకొచ్చారు.

 

ఎన్నికల రేస్ లో కాస్త వెనుకబడినట్లు ఉన్న బీజేపీ 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 31 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకొని హ్యాట్రిక్‌ సాధించాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అలాగే ఈసారి అధికారం దక్కడం ఖాయమన్న ధీమాతో కాంగ్రెస్ ముందుకెళుతోంది. అటు వామపక్షాలు ఒంటరిపోరాటంతో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి.