TELANGANA

మేడిగడ్డ అందుకే కుంగిందా ? NDSA సంచలన రిపోర్ట్…

కాళేశ్వరం ప్రాజెక్టు అంతా డొల్లేనా? ఆ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలోనే లోపం ఉందా? అని మొదటి నుంచి వస్తున్న అనుమానాలే నిజమయ్యాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదికలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై ఫోకస్ చేసిన అథారిటీ.. ఆ బ్యారేజ్ ప్లానింగ్‌కు, డిజైన్‌కు తేడా ఉందని గుర్తించింది. నిర్మాణంలో వాడిన మెటీరియల్ దగ్గర నుంచి, మెయింటెనెన్స్ వరకు అడుగడుగునా లోపాలు ఉన్నాయి. 16, 17, 19, 20 పిల్లర్లలో పగుళ్లు ఉన్నాయని గుర్తించిన అథారిటీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ నీటిని ఆపితే బ్యారేజ్ మొత్తం డేంజర్‌లో పడుతుందని తేల్చి చెప్పింది.

 

మేడిగడ్డ ఒక్కటే కాదు.. అన్నారం, సుందిళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందంటూ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరో బాంబ్ పేల్చింది. అన్నారంలో పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇవేమంత పెద్ద విషయాలు కావని మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఖండించగా.. ఆ రెండు బ్యారేజ్‌లకు కూడా ప్రమాదం వాటిల్లవచ్చని, తక్షణం తనిఖీలు చేపట్టాలని డ్యామ్ సేఫ్టీ అథారిటి కమిటీ నివేదికలో స్పష్టంచేశారు. పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడమేనని నివేదికలో పేర్కొంది.

 

మొత్తం 20 అంశాలు అడుగగా.. 11 అంశాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. ఇన్ట్ర్సుమెంటేషన్, వర్షాకాలం ముందు, తర్వాత ఇన్స్ఫెక్షన్ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు, తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్ లపై తెలంగాణ సర్కార్ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. వీటికి సంబంధించిన సమాచారాన్ని సర్కార్ దాచిపెట్టిందని తెలిస్తే.. చట్టపరమైన చర్యలు తప్పవని డ్యామ్ అథారిటీ వెల్లడించింది.

 

2019లో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్.. 2023 అక్టోబర్ 21న పెద్దశబ్దంతో పునాది కుంగిపోయింది. దానిపై జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. అక్టోబర్ 24న మేడిగడ్డ డ్యామ్ ను సందర్శించింది. 25న తెలంగాణ ప్రభుత్వం నుంచి 20 అంశాలపై సమాచారం ఇవ్వాలని కోరగా.. పూర్తి సమాచారం అందించలేదు. దాంతో 29 లోగా పూర్తి సమాచారం ఇవ్వకపోతే.. బ్యారేజీ నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని భావిస్తామని చెప్పినా.. తెలంగాణ సర్కార్ వాటిని బేఖాతరు చేయలేదు.

 

ఈ నేపథ్యంలో కాళేశ్వరం తన మానసపుత్రికగా చెప్పుకునే కేసీఆర్ స్పందనేంటి? ప్రభుత్వం ఏం చేయబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్టును రీ కన్‌స్ట్రక్షన్ చేస్తారా? ఇప్పటివరకు పెట్టిన ఖర్చు ఎవరు భరిస్తారు? ప్రజల సొమ్మును సీఎం ఇష్టారీతిన వాడుకునే అధికారం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.