తెలంగాణలో కాంగ్రెస్ కు కలిసొచ్చే సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాలతో సీట్ల కోసం భారీగా పోటీ కొనసాగింది. టికెట్ రాక పోటీలో నిలిచిన రెబల్స్ పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్దుల విజయానికి సహకరించేందుకు అంగీకరించారు. పార్టీ అధికారంలోకి రావటం కోసం పని చేస్తామని వెల్లడించారు. వీరితో పార్టీ ముఖ్య నేతలు చేసిన మంత్రాంగం ఫలిచింది. దీంతో, ఇక..గెలుపే లక్ష్యంగా ప్రచారం స్థాయిని పెంచేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది.
Advertisement
కాంగ్రెస్ ముఖ్య నేతల సంప్రదింపులో రెబల్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెబల్స్ గా నామినేషన్ వేసిన వారిలో విత్ డ్రా చేసుకున్నారు. సూర్యపేట: పటేల్ రమేష్ రెడ్డి, బాన్సువాడ – కాసుల బాలరాజ్, జుక్కల్ – గంగారాం,వరంగల్ వెస్ట్ – రాఘవరెడ్డి, డోర్నకల్ – నెహ్రూ నాయక్,,ఇబ్రహీంపట్నం – దండెం రామిరెడ్డి, పినపాక – విజయ్ గాంధీ, వైరా – రామ్మూర్తి నాయక్ తో పాటుగా ఎల్బీనగర్ స్వతంత్ర అభ్యర్థి కొమురెళ్లి రాజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ కి మద్దతుగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇదే సమయంలో అనూహ్యంగా జూబ్లిహిల్స్ లో స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. దీని ద్వారా అజాహరుద్దీన్ కు సమీకరణాలు కలిసొచ్చే అవకాశం ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉండటంతో రెబల్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టికెట్లు దక్కని ఈ నేతలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని పార్టీ హామీ ఇచ్చింది. దీని ద్వారా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రూట్ మరింత క్లియర్ అయింది. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న జిల్లాల్లోనూ కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. స్థానికంగా ప్రజలతో ప్రచార సమయంలో నేతలు మమేకం అవుతున్నారు. గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమయ్యారు. ఇక, ఇప్పుడు రెబల్స్ సైతం పోటీ నుంచి తప్పుకోవటంతో పార్టీకి అంతా మంచి సమయం ప్రారంభమైందని..విజయం ఖాయమని పార్టీ నేతలు మరింత విశ్వాసంతో కనిపిస్తున్నారు.