TELANGANA

80 సీట్లలో కాంగ్రెస్ గెలవగలదా? రేవంత్ ధైర్యమేంటి..?

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారానికి మూడు రోజుల వ్యవధి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తోంది. 80 స్థానాల్లో విజయం ఖాయమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. అలా రాకుంటే కెసిఆర్ వేసే శిక్షకు మేము బాధ్యులమవుతామని చెబుతున్నారు. అయితే ఆయన ప్రమాదకర సవాల్ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మునుపెన్నడు తెలంగాణలో ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదన్న విషయాన్ని రేవంత్ మరిచిపోతున్నారు. ఒకవేళ రేవంత్ చెప్పినట్టు సీట్లు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ రికార్డ్ సాధించినట్టే.

 

More

From Ap politics

గత తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అతి తక్కువ స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రతి ఎన్నికల్లో మెజారిటీ దక్కలేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆ పార్టీకి అతి తక్కువ స్థానాలే లభించాయి. కాంగ్రెస్ ప్రభంజనంలో సైతం తెలంగాణలో మెజారిటీ రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ హవాకు గండి పడింది.

 

1983లో టీడీపీ ఆవిర్భవించింది. అటు తర్వాత ఏ ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకోలేదు. 119 స్థానాలు ఉన్న తెలంగాణలో 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ గెలిచింది 30 స్థానాల్లో మాత్రమే. 1989 ఎన్నికల్లో ఏపీలో మొత్తం 181 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంత భారీ వేవ్లో సైతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాలు 59 మాత్రమే. 1994లో 26 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. తెలంగాణలో 10 స్థానాల్లోపే పరిమితమైంది. 1999 ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ 42 స్థానాల్లో గెలుపొందింది.

 

2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ తెలంగాణలో వచ్చిన మాత్రం 48 స్థానాలే. 2009 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 49 స్థానాలనే గెలుచుకుంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఎన్నికలు జరిగాయి. 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలకు పరిమితమైంది. 2018 ముందస్తు ఎన్నికల్లో 19 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. నాలుగు దశాబ్దాల చరిత్రను తిరిగి చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కువ సీట్లు దక్కించుకున్నది ఒక్కసారే.

 

అయితే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం తాము 80 సీట్లలో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేయడం విశేషం. అసలు 60 స్థానాల మార్కు దాటని కాంగ్రెస్ పార్టీ.. 80 స్థానాలను దక్కించుకుంటుందా? అన్నది ప్రశ్నార్ధకంగా ఉంది. టిడిపి ఆవిర్భావంతోనే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి పడింది. తెలంగాణలో టిడిపి దాదాపు కనుమరుగైనా.. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు దక్కించుకోలేదు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీకి దూరం కావడం.. ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులు తెలంగాణపై పడడం.. వంటి కారణాలతో టిడిపి క్యాడర్ కాంగ్రెస్ కు బాహటంగా మద్దతు తెలుపుతుండడం రేవంత్ రెడ్డి ధీమాకు కారణం అని తెలుస్తోంది. డిసెంబర్ 3న ఫలితాలు బట్టి ఒక క్లారిటీ రానుంది. రేవంత్ చెబుతున్నట్టు 80 సీట్లు దక్కితే గత నాలుగు దశాబ్దాల రికార్డును కాంగ్రెస్ పార్టీ అధిగమించినట్టే.