తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు డిక్లరేషన్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇస్పటికే రెండు హామీల అమలు మొదలు పెట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజులకే(డిసెంబర్ 9 నుంచి) ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. మిగతా హామీలను కూడా అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నిధుల సమీకరణకు కసరత్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈమేరకు ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
More
From Telangana politics
దరఖాస్తు ఫాం ఇదే..
ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన దరఖాస్తు ఫాంను ప్రభుత్వం విడుదల చేసింది. ఆరు హామీలకు వేర్వేరుగా కాకుండా ఒకే దరఖాస్తుతో ఆరు పథకాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది. ఈ దరఖాస్తు ఫాంలో మొదట పేరు, చిరునామాతోపాటు ఆధార్ కార్డు నంబర్ రాయాల్సి ఉంటుంది. మిగతా పేజీల్లో మహాలక్ష్మి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సబంధించిన వివరాలు పేర్కొనాలి. ఇక ఆరు గ్యారంటీల్లో యువ వికాసం మినహా ఐదు గ్యారంటీలకు ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తుల ఆధారంగా అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. మరోవైపు ప్రతీ గ్యారంటీకి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. వాటికి అనుగుణంగా దరఖాస్తుల విశ్లేషణ, పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది.
తెల్ల రేషన్‌కార్డు ప్రామాణికం..
ప్రస్తుతం అమలు చేసే ఐదు గ్యారంటీలకు తెల్ల రేషన్‌కార్డు ప్రమాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు ఫారానికి ఆధార్‌కార్డుతోపాటు తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. ప్రతీ దరఖాస్తును కంప్యూటరైజ్ చేస్తారు. తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి దరఖాస్తుదారు ఏ గ్యారంటీకి అర్హులో నిర్ణయిస్తారు.
వైట్ రేషన్‌కార్డు లేకపోతే..
గ్యారంటీల దరఖాస్తుకు రేషన్ కార్డు లేనివారు రేషన్‌కార్డు నంబర్ దరఖాస్తు ఫారంంలో రాయాల్సి ఉంటుంది. కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్క్రూటినీ సమయంలో వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
వీరు అర్హులేనా?
ఇక ఐదు గ్యాంటీలకు అర్హతలపై ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఇందుకోసం కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు, టాక్స్ పేయర్లు, తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉండి తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు, భూస్వాములు, ఇలా చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో మార్గదర్శకాలు వస్తే ఎవరెవరు అర్హులు అనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
దరఖాస్తుల స్వీకరణ ఇలా..
దరఖాస్తులు ఎవరు చేసుకోవాలి, ఎలా స్వీకరిస్తారు అనే విషయంపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆసరా పింఛన్లు, రైతుబంధు, ఇతర ఫలాలు పొందుతున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ, వీటిపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఇక దరఖాస్తులను గ్రామ, వార్డు సభల్లో మాత్రమే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తీసుకుంటారు. గడువు ముగిసిన తర్వాత కూడా స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఎక్కడ స్వీకరిస్తామనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.