ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు ఓవైపు, ఈసారి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైయస్ జగన్ మరోవైపు వ్యూహాత్మకంగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ బహిరంగ సభలలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకు సాగాలని రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించి ఏపీ ఎన్నికలకు సమర శంఖాన్ని పూరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నేడు చంద్రబాబు రా కదలిరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రా కదలిరా కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఈ కార్యక్రమం ద్వారా సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా నేటి నుంచి 29 వరకు రాష్ట్రంలోని పార్లమెంటు స్థానాలలో బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్న చంద్రబాబు రా కదలిరా పేరుతో ప్రతిరోజు రెండు సభలలో పాల్గొననున్నారు. మొత్తం 24 రోజుల్లో 25 బహిరంగ సభలో పాల్గొనాలని నిర్ణయించిన చంద్రబాబు కొన్ని రోజులు ఒకేరోజు మూడు నాలుగు సభలలో కూడా పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి, గత టిడిపి పాలనకు ప్రస్తుత వైసిపి పాలనకు తేడా చెప్పి వచ్చే ఎన్నికలలో ప్రజలు ఏం చేయాలో కర్తవ్య బోధ చేసే పనిలో, ప్రజలను చైతన్యవంతులను చేసే పనిలో భాగంగా చంద్రబాబు రా కదలిరా పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు.
ఈ సభల ద్వారా చంద్రబాబు ప్రజల నాడిని కూడా తెలుసుకోనున్నారు. ప్రజలకు టీడీపీ పట్ల సానుకూల వైఖరి ఉందా.. లేదా అన్నది తెలుసుకోనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ను కూడా కలుపుకుని ముందుకు సాగనున్న చంద్రబాబు సభల పర్యావసానం ఎలా ఉంటుంది? ప్రజలు బాబును ఆదరిస్తారా లేదా అన్నది ఎన్నికల్లో తేలనుంది.